వైసీపీ నాయకులు చంద్రబాబుకి పవన్ అండగా నిలుస్తున్నాడని, తన 'జనసేన'ని ఆయన టిడిపి భజనసేనగా మారుస్తున్నాడని అంటున్నారు. కానీ పవన్ ఇంతకాలం బిజెపిని, వైసీపీనే కాదు.. టిడిపిని కూడా కొన్ని విషయాలలో టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి గొడవలు కాకుండా సమస్యలను లేవనెత్తి చంద్రబాబు ద్వారా ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడని, కాబట్టే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ని, ఏపీలో ఉన్న టిడిపిని కాస్త మెత్తగా చూస్తున్నాడని కొందరు అంటున్నారు. కానీ ఇంకొన్ని గంటల్లో పవన్ ఏ విధమైన రాజకీయ స్టాండ్ తీసుకోనున్నాడు? ఆయన టిడిపి తప్పులను సుతిమెత్తగా వదిలేస్తాడా? అనేది తేలనుంది.
ఇక పవన్ ఉండవల్లి, జయప్రకాష్‌నారాయణ్‌లతో ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశాడు. నిజానికి ప్రత్యేకహోదా కాకపోయినా ప్రత్యేక ప్యాకేజీ చాలని టిడిపి అంటూ వచ్చింది. మరి ఇన్ని బడ్జెట్‌ల విషయంలో ఏపీకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడని టిడిపి చివరి బడ్జెట్‌లో మాత్రం నిరసన గళం వినిపించిందంటే టిడిపి ఏపీ ప్రజలను మోసం చేసిందనే భావించాలి. అదే మంటే కేంద్రంతో గొడవ పడితే అసలు నిధులు రావు... అంటూ చెప్తున్నారు.
మరి బిజెపి అధికారంలోలేని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని మోదీని ఎదిరించి, పట్టుబట్టి తమకు రావాల్సిన నిధులను పొందడం లేదా? ఆమాత్రం చేవ టిడిపికి ఎందుకు లేకుండా పోయింది...? ఇక ప్రత్యేకహోదా విషయంలో జల్లికట్టు స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిస్తే దేశంలోనే బ్యాంకులను మోసం చేసిన ఘనులలో ఒకడైన కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్రత్యేకహోదా ఉద్యమాన్ని పందుల పోటీతో పోల్చడం ఎవరైనా మరిచిపోగలరా? ప్రత్యేక ప్యాకేజీ చాలని, నిధులు బాగా వస్తున్నాయని ఇంత కాలం కల్లబొల్లి మాటలు చెప్పిన టిడిపి ఇందులో దోషి కాకుండా ఎలా ఉంటుంది?
ఇక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏపీని మోసం చేసిందన్న విషయం పవన్ ఏర్పాటు చేసిన కమిటీ నొక్కిచెప్పిందని సమాచారం. మరోవైపు టిడిపి ప్రభుత్వం చేసిన అవినీతి, కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర ప్రయోజనాలకు వాడుకున్న విధానాన్ని కూడా ఈ కమిటీ ఘాటుగా, వివరంగా విన్నవించిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కమిటీ పవన్‌కి నివేదికను అందజేసింది. దీనిని మార్చి 3న ప్రకటించనున్నారు. మరి ఈ నివేదిక చెప్పినట్లు పవన్ టిడిపిని కూడా విమర్శిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? అనేది ఆసక్తికరం.
పవన్ టిడిపిని విమర్శించాల్సివస్తే ఆయన రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టిడిపి, బిజెపి మూడింటికి దూరంగా లోక్‌సత్తా, వామపక్షాలతోనే ముందుకు సాగవచ్చని అంటున్నారు. ఇదే జరిగితే జనసేనతో పాటు ఈ కూటమిలోని వామపక్షాలు, లోక్‌సత్తా, జనసేనలు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలలో పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పవన్ ప్రకటన మీద టిడిపి, వైసీపీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.