తెలుగు సినిమాలలో సినిమాల కోసం వేసే భారీ సెట్స్ కొన్నింటిని అలాగే పర్మినెంట్‌గా ఉంచుతారు. ఉదాహరణకు సూపర్‌స్టార్ కృష్ణ నటించిన 'సింహాసనం' సెట్స్ ఎన్నో పద్మాలయా స్టూడియోస్‌లో ఉండేవి. ఆ సినిమా విడుదల తర్వాత కూడా సెట్‌ని అలాగే ఉంచి, పద్మాలయా స్టూడియోస్ నిర్మించే టివీ సీరియల్స్‌కి ఆ సెట్స్‌ని వాడుకునే వారు. ఇక 'బాహుబలి' సెట్‌ని కూడా ఆర్.ఎఫ్.సిలో అలాగే ఉంచి, పర్యాటక స్థలంగా మార్చి సెట్స్‌ని చూసేందుకు ప్రత్యేక రేటుని కూడా పెట్టారు. ఇక మహేష్ నటించిన 'అర్జున్' చిత్రంలోని 'మధుర మీనాక్షి టెంపుల్ సెట్', 'ఒక్కడు'లో చార్మినార్ సెట్ ఇలాగే ఉపయోగించుకున్నారు. ఇక 'ఊ కొడతారా... ఉలిక్కిపడతారా' సెట్‌లో బెల్లంకొండ సురేష్ తన చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసి, మంచు ఫ్యామిలీకి రెంట్ కట్టకపోవడంతో పెద్ద గొడవే జరిగింది.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సుకుమార్ రామ్‌చరణ్‌తో 'రంగస్థలం 1985' చిత్రం తీస్తున్నాడు. ఇది పూర్తి గ్రామీణ నేపధ్యం ఉన్న చిత్రం కావడంతో మొత్తం ఔట్‌డోర్‌లో రాజమండ్రి పరిసరాలలో షూటింగ్ చేయలేక గోదావరి జిల్లాలలోని గ్రామాలు 1980లలో ఎలా ఉండేవో ఉట్టిపడేలా భారీ సెట్స్‌ని హైదరాబాద్‌లో వేశారు. ఇటీవల ఈ సెట్‌ని చిరంజీవి, రాజమౌళి వెళ్లి చూసి వచ్చి సుకుమార్ సెట్ విషయంలో తీసుకున్న చిన్న చిన్న జాగ్రత్తలను కూడా రాజమౌళి మెచ్చుకున్నాడు. ఇక తాజాగా ఆయన తన అసిస్టెంట్స్‌తో కలసి మరోసారి ఈ సెట్‌ని సందర్శించడం ఆసక్తిని కలిగిస్తోంది. రాజమౌళికి ఈ సెట్ మొత్తాన్ని స్వయంగా సుకుమారే చూపించాడు.
ఇక రాజమౌళి త్వరలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ఓ భారీ మల్టీస్టారర్ తీయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ గ్రామీణ నేపధ్యంలో సాగుతుందని, కాబట్టి ఈ విలేజ్ సెట్ తన చిత్రానికి సూట్ అవుతుందా? లేదా? ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయం మీదనే రాజమౌళి 'రంగస్థలం 1985' సెట్‌ని చూసి వచ్చాడని అంటున్నారు.