నిజానికి ఇండస్ట్రీలో హిట్స్ మాత్రమే కొలమానం అని చెబుతారు. కానీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. వంటి స్టార్స్‌కి వరుసగా ఫ్లాప్‌లు వచ్చినా కాస్త డామేజ్, ప్రేక్షకాభిమానుల్లో నిరాశ, నిస్పృహలు వస్తాయే గానీ వారికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు. ఎంతో కాలం చిరంజీవి మేకప్ వేసుకోని రోజులు ఉన్నాయి. ఇక బాలకృష్ణకి వరుస ఫ్లాప్‌లు వచ్చాయి. పవన్‌కళ్యాణ్ వరుసగా డిజాస్టర్స్‌ని అందుకున్నాడు. అయినా వారి తదుపరి చిత్రాల విషయంలో ఎలాంటి మార్పు లేదు. మరింత క్రేజ్‌తో సూపర్ కలెక్షన్స్ సాధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మహేష్‌బాబు విషయంలో కూడా అదే జరుగుతోంది. 'బ్రహ్మోత్సవం, స్పైడర్' చిత్రాల డిజాస్టర్స్ తర్వాత కూడా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న 'భరత్ అనే నేను' అనే చిత్రం బిజినెస్‌లో కూడా ఈ రెండు చిత్రాల ఎఫెక్ట్ ఏమీ లేదని చెప్పాలి. మహేష్‌బాబు వంటి హీరోకి ఒక్క బ్లాక్‌బస్టర్ పడినా మరో పదేళ్లు ఢోకా ఉండదనేది వాస్తవం.
ఉదాహరణకు ఎన్నో వరుస ఫ్లాప్‌ల తర్వాత కూడా పవన్‌కి వచ్చిన 'గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది' చిత్రాలతో రెట్టింపు క్రేజ్ తెచ్చుకున్నాడు. అదే విధంగా మహేష్ విషయంలో కూడా 'భరత్ అనే నేను' మహేష్‌కి మరో బ్లాక్‌బస్టర్‌ని అందిస్తుందని అందరు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక రెండు పరాజయాల వేళ ఈ చిత్రం విషయంలో మహేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం మంచి పరిణామం. ఈ చిత్రం ముందుగా ఏప్రిల్ 26 అనుకుని ఇప్పుడు మరో వారం ముందుకి ప్రీపోన్ అయింది. కాబట్టి మిగిలిన విషయంలో వర్క్‌ని స్పీడ్ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' విషయంలో ఇప్పటికే ఫస్ట్ ఇంపాక్ట్, విడుదలైన రెండు పాటలతో ప్రమోషన్‌లో ముందున్నారు. కానీ 'భరత్ అనే నేను' విషయంలో ఓ ప్రమాణ స్వీకారం ఆడియో, ఓ టైటిల్ లుక్ తప్ప సందడి లేదు. ఇలాంటి సమయంలో షూటింగ్‌ని వేగంగా పూర్తి చేసి ఇప్పటినుంచే ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టడం అవసరం.
మొత్తానికి మహేష్ తన 20 ఏళ్ల కెరీర్‌లో ఇప్పుడు ఇలాంటి క్లిష్టపరిస్థితి ఎదుర్కొటున్నాడు. సినిమా బాగా రావడానికి అన్ని దర్శకుడు కొరటాల శివకే వదిలేయకుండా తాను లేని సీన్స్‌ని కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రం విడుదలైన ఓ వారం గ్యాప్‌లో వస్తున్న రజనీ 'కాలా'ని కానీ, బన్నీ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' వంటి వాటిని కూడా తక్కవ చేసి చూడలేం. సినిమా బాగుంటే లాంగ్ రన్ ఉంటుంది. లేకపోతే కేవలం వారం రోజులకే ఈ చిత్రం పరిమితమై 'కాలా' సమయానికే చేతులెత్తే పరిస్థితి ఉందని చెప్పవచ్చు.