ఏమాట కామాటే చెప్పుకోవాలంటే 'రోబో, చంద్రముఖి' వంటి చిత్రాల తర్వాత రజనీ ఇమేజ్ తగ్గకపోయినా 'కొచ్చాడియన్, లింగా, కబాలి' చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక 'కొచ్చాడియన్, లింగా' చిత్రాల విషయంలో బయ్యర్లు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఇక తక్కువ బడ్జెట్‌తో రంజిత్‌పా దర్శకత్వంలో వచ్చిన 'కబాలి' చిత్రం తమిళవెర్షన్ ఓపెనింగ్స్ ద్వారా గట్టెక్కినా కూడా తెలుగులో మాత్రం సాయంత్రానికే ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో శంకర్‌ని చూసి '2.0' చిత్రాన్ని భారీ రేట్లకు కొనడానికి కూడా బయ్యర్లు భయపడుతున్నారు. ఇక '2.0' విడుదల ఎప్పుడో తెలియకపోవడంతో ఆ చిత్రం రావాల్సిన ఏప్రిల్ 27వ తేదీన రజనీ నటించిన మరో చిత్రం 'కాలా' విడుదల కానుంది. దీనిని వండర్‌బార్ పతాకంపై ఆయన అల్లుడు, స్టార్ ధనుష్ నిర్మిస్తుండగా, దీనికి కూడా రంజిత్‌పానే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ హక్కులను 40కోట్లు చెబుతుండటంతో దీనిని తెలుగులో కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఈ విషయం గ్రహించిన ధనుష్ సినిమా విడుదలకు ఎంతో సమయం ఉండగానే టీజర్స్ ఇతర ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టి సినిమాకి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మన నిర్మాతలు మాత్రం 30కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా పెట్టేందుకు సిద్దంగా లేరు. కానీ తమిళంలో మాత్రం రజనీ రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
కాగా 'కాలా' టీజర్‌ని మార్చి 1వ తేదీన విడుదల చేస్తామని ధనుష్ ప్రకటించారు. కానీ కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి దివంగతులు కావడంతో ఈ రోజు (మార్చి 2) టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో రజనీ స్టైల్, యాక్షన్, డైలాగులు కేకపెట్టించే విధంగా ఉన్నాయి. ఇందులో రజనీ పాత్ర పూర్తి పేరు కరికాలన్. ముద్దుగా కాలా సేఠ్ అని పిలుస్తుంటారని అర్ధమవుతోంది. ఇక ఈ టీజర్‌లో ప్రతినాయకుడైన నానా పాటేకర్ 'కాలా.. ఇదేం పేరు' అంటాడు. దానికి రజనీ 'కాలా అంటే నలుపు. కరికాలన్ అంటే గాడ్ ఆఫ్ డెత్. రక్షించడానికి పోరాడే వాడు...' అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ ఆకట్టుకుంటోంది. 'నేనొక్కడినే వచ్చాను. దమ్మున్నోడు రండిరా...మీరింకా నా పూర్తి రౌడీయిజం చూడలేదు. చూస్తారు' అని రజనీ స్టైలిష్‌గా చెప్పిన డైలాగ్ అదిరింది.
ఇక ఈ చిత్రం టీజర్ చూసిన తెలుగు నిర్మాతలు మాత్రం 'కబాలి' చిత్రం విషయంలో కూడా టీజర్‌ని అద్భుతంగా కట్ చేసి మోసం చేశారని, కానీ ఈ సారి మాత్రం ఈ రైట్స్ విషయంలో జాగ్రత్త పాటించాలని ఆలోచిస్తున్నారు. ఇక 'కాలా' చిత్రం నాటి 'భాషా' చిత్రాన్ని గుర్తు చేస్తోందని అంటున్నారు. ఈ చిత్రం కూడా ముంబై, చెన్నై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందడం విశేషం. ఇక 'కాలా' విడుదల కూడా ఏప్రిల్ 27కావడంతో వారం ముందు మహేష్ 'భరత్ అనే నేను', వారం తర్వాత అల్లుఅర్జున్ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'లతో పోటీ పడి గెలవాలంటే చిత్రంలో కంటెంట్ ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పాలి.