ఒకరు తప్పు చేస్తే ఆ రంగం మొత్తాన్ని తిట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అలా తప్పులు చేసే వారి వల్ల మిగిలిన ఆ రంగంలోని నిజాయితీ పరులు కూడా విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇప్పటికే మీడియా తన క్రెడిబులిటీని పోగొట్టుకుంది. ప్రతి విషయాన్ని టీఆర్పీ రేట్ల కోసం చూడటం జుగుప్సాకరంగా ఉంది. దాంతో కొందరు సోషల్ మీడియాలో మీడియాను వేశ్యలతో పోలుస్తున్నారు. వేశ్య అయినా నిజాయితీగా డబ్బులు తీసుకుని సుఖం ఇస్తుందని, కానీ మీడియా మాత్రం వేశ్య కంటే హీనంగా మారిందని ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మెరుగైన సమాజం కోసం అని రెచ్చగొట్టే చర్చలు చేయడం, ప్రతి విషయాన్ని కాంట్రవర్శీ చేసి లబ్దిపొందడంలో నవగ్రహ చానెల్ ఎంతగా దిగజారుడుతనంతో వ్యవహరిస్తుందో అర్ధమవుతోంది. వారు జనాలను వెర్రి వారుగా భావిస్తున్నారు. కత్తిమహేష్ - పవన్ ఫ్యాన్స్ విషయం నుంచి ప్రతి విషయంలోనూ అదే ధోరణి, కత్తి మహేష్ ఎపిసోడ్ ముగియడం, వెంటనే శ్రీదేవి మృతి వార్త నవగ్రహ చానెల్‌కి విందు భోజనంగా కనిపించింది. చర్చల పేరుతో పిలిచి రచ్చలు చేస్తున్నారు.
ఇక శ్రీదేవి మరణం విషయంలో దేశవ్యాప్త మీడియా సైతం ఇదే జరిగింది. దీంతో రిషికపూర్ నుంచి కాజల్ వరకు, తమ్మారెడ్డి, లక్ష్మీభూపాల నుంచి కోనవెంకట్ వరకు అందరూ మీడియాను దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా నిర్మాత, రచయిత కోనవెంకట్ కూడా నవగ్రహ చానెల్‌పై ధ్వజమెత్తాడు. శ్రీదేవి మీద ఈ చానెల్ '70 గంటలు.. 7 ప్రశ్నలు' అంటూ ఓ కార్యక్రమం ప్రసారం చేసింది. దుబాయ్ రాజు ఈ విషయంలో కలుగజేసుకున్నాడా? అని సందేహం వెలిబుచ్చింది. అలాగే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేసిన విచారణ సైతం సరిగా సాగలేదని తెలిపింది. అయితే శ్రీదేవి ఎపిసోడ్ ముగిసిపోవడంతో ఈ చానెల్ వారు ఆత్మహత్య యత్నం చేసుకోవాలని భావిస్తున్నట్లు కొందరు సెటైర్లు వేశారు. ఈ కేసు క్లోజ్ కావడం నవగ్రహ చానెల్‌కి బాధని కలిగిస్తోందంటూ కోనవెంకట్ ధ్వజమెత్తాడు. చివరకు దుబాయ్ రాజు మీద కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు? ఒక మీడియా సంస్థగా మీకేం కావాలి? మీరు ఇన్వెస్టిగేషన ఏజెన్సీగా ఎప్పుడు మారారు? మీకు మీరే బ్రేక్‌లిచ్చుకోండి అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
నవగ్రహ చానెల్ ప్రజా సమస్యలు, దేశ, రాష్ట్ర విషయాలలో జరిగే అవకతకలు మానేసి కేవలం టీఆర్పీల కోసం దిగజారుడుగా వ్యవహరిస్తోందని, కులం అడిగిన వాడిని చెప్పుతో కొట్టమని చెప్పే ఈ సంస్థే ఏదో ఒక సెన్సేషన్ సృష్టించి కులం పేరుతో చర్చలు జరిపి కులాల వారిగా అందరినీ రచ్చ కీడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇక కోనవెంకట్ నవగ్రహ చానెల్ విషయంలో చెప్పింది నిజమే గానీ కేవలం క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం, డబ్బు కోసం 'డర్టీ పిక్చర్' వంటి చిత్రాలలో మసాలా గుప్పించి క్యాష్ చేసుకునే వారు... త్వరలోనే శ్రీదేవి క్రేజ్‌ని ఆమె బయోపిక్‌లో చూపించేందుకు సిద్దపడే సినిమా పెద్దలు మసాలాలు లేకుండా వాస్తవాలు తీయగలరా? అలా తీయకుండా వారిని నిరోధించే శక్తి సినిమా పెద్దలకు ఉందా? అనేది చెప్పాలి.