నేటితరంలోని పలువురు నటీనటులకు మెగాస్టార్ చిరంజీవినే స్ఫూర్తి. ఆ కోవలోకి వచ్చే ఆర్టిస్ట్ శ్రీకాంత్. కెరీర్ మొదట్లో చిన్న వేషాలు, యంగ్ విలన్ పాత్రలు, మెయిన్ విలన్‌కి కొడుకు వేషాలు, సపోర్టింగ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టు వంటి పాత్రలు చేశాడు. తర్వాత హీరోగా మారి యూత్‌ని, మహిళలను మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుని మినిమం గ్యారంటీ హీరోగా, ఫ్యామిలీ స్టార్‌గా మెప్పించాడు. బాపు, విశ్వనాథ్, పెద్దవంశీ, కృష్ణవంశీ వంటి దిగ్గజ దర్శకుల చిత్రాలలో నటించడం ఈయన అదృష్టం.
ఇక తన 100వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో 'మహాత్మా' చేశాడు. ఈయన తాను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి మెగాస్టార్ చిరంజీవే కారణమని చెబుతున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, నేను 9.10 తరగతులు చదివేటప్పుడు చిరంజీవి సినిమా వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్‌తో కలిసి పక్కనే ఉన్న బాపట్లకు వెళ్లి సినిమా చూసేవారం. మా చేతుల్లో పూలు, రంగుల కాగితాలు, చిల్లర ఉండేవి. సినిమా స్టార్ట్ అయిన తర్వాత మొదటిసారిగా తెరపై చిరు ఎంట్రీ ఇచ్చినప్పుడు పూలు, కాగితాలు, డబ్బులను స్క్రీన్‌పైకి విసిరేవారం. ఎంతో ఆనందంతో గోల చేసేవాళ్లం. చిరంజీవి సినిమాలు చూడటం వల్ల సినిమాలపై, నటనపై క్రేజ్ వచ్చింది.
ఆయనను నేరుగా చూస్తానని కూడా అనుకోని నేను.. ఆయనతో చిత్రం చేయడం అంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? అని చెప్పాడు. ఇక ఈయన చిరంజీవితో కలిసి శంకర్‌దాదా ఎంబిబిఎస్, శంకర్‌దాదా జిందాబాద్' చిత్రాలలో కీలకమైన పాత్రలను పోషించాడు. ఇక శ్రీకాంత్‌కి ఊహకి వివాహం చేసిన పెద్ద మనిషి కూడా చిరంజీవినే.