అతిలోక సుందరి శ్రీదేవి మరణించిన తర్వాత నాలుగు రోజులుగా ఆమె గురించిన వార్తలే మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయని, ఏకాంతంగా కూర్చుని బాధను అనుభవించడానికి తమకు సమయం ఇవ్వాలని, తమను కొంతకాలం మీడియా వదిలేయాలని కపూర్, అయ్యప్పన్, మార్వా కుటుంబ సభ్యులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. మీడియా తమకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వారు తమ ప్రకటనలో 'శ్రీదేవి జీవితాంతం గౌరవంగా బతికారు. ఇకపై కూడా అదే గౌరవాన్ని కొనసాగించాలని కోరారు. గత కొన్ని రోజులుగా మేము విషమ పరీక్షలను ఎదుర్కొంటున్నాం మేము ప్రశాంతంగా దు:ఖించేందుకు అవకాశం ఇవ్వాలి.
శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలి. కష్టకాలంలో అండగా నిలిచిన శ్రీదేవి సన్నిహితులు, స్నేహితులు, సహనటులు, వెలకట్టలేని అభిమానులు, దేశం, ప్రపంచం, మీడియా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీదేవి కుమార్తెలైన జాన్వి, ఖుషీలకు తమ కుటుంబాలు ఎంతో అండగా ఉంటాయని మాట ఇచ్చారు. చేదోడు వాదోడుగా ఉండి, శ్రీదేవిపై కురిపించిన ప్రేమాభిమానాలే ఆమె పిల్లలకు కూడా అందిస్తామని తెలిపారు. శ్రీదేవి పిల్లలకు తల్లిలేని లోటు కనిపించకుండా తల్లిలేని బాధ నుంచి వారు బయట పడేలా చేస్తామని తెలిపారు.
వారికి అండగా నిలిచి, శ్రీదేవి తన కూతుర్ల విషయంలో కన్న కలలను నిజం చేసి, శ్రీదేవి తన కుమార్తెలను ఎలా చూడాలనుకుంటుందో అదే జరిగేలా అందరు శ్రీదేవి కలలను నిజం చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇక బోనీకపూర్‌తో పాటు జాన్వి, ఖుషీలు శ్రీదేవి శరీరానికి అంత్యక్రియలు జరిపారు.