హీరో నాని నిర్మాతగా మారి, వాల్‌పోస్టర్ పతాకంపై ప్రశాంత్ వర్మ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ 'అ!' చిత్రం నిర్మించాడు. తక్కువ బడ్జెట్‌లో, విమర్శకుల ప్రశంసలు పొంది వినూత్న చిత్రంగా, ప్రయోగాత్మక మూవీగా ఈ చిత్రం ఓవర్‌సీస్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను అందుకుంటోంది. దాంతో పలువురు నిర్మాతలు, హీరోల దృష్టి ప్రశాంత్ వర్మపై పడింది. ఇక ఈ మధ్య వచ్చిన చిత్రాలతో 'అ' ప్రశాంత్‌వర్మ, 'ఛలో'తో వెంకీ కుడుముల, 'తొలి ప్రేమ'తో వెంకీ అట్లూరిలు సెహభాష్ అనిపించుకున్నారు. ఇక రెండేళ్లకిందటే 'పెళ్లిచూపులు' వంటి చిత్రం అందించిన తరుణ్ భాస్కర్ రెండో చిత్రం ఎంత కాలంగానో ఊరిస్తోంది. దానిని బట్టి మంచి చిత్రాలు తీసిన దర్శకులకు కూడా వెయిటింగ్‌లు తప్పవని రుజువవుతోంది.
ఇక 'అ' దర్శకుడు తాజాగా మాట్లాడుతూ, నా వద్ద 30,40 చిత్రాల కథలు ఉన్నాయి. ప్రతి హీరోకి సూట్ అయ్యే స్టోరీలు ఎప్పుడో తయారు చేసుకున్నాను అని తెలిపాడు. తాజాగా ఆయన తనకు బాలకృష్ణతో సినిమా చేయాలని ఉందని, ప్రయోగాత్మకంగా కాకుండా బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కి, ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్‌ని సరిపడా ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీ తన వద్ద ఉందని చెప్పాడు. ఇక బాలయ్య కూడా వెరైటీ చిత్రాలు చేయడంలో ముందుంటాడు. 'బాబాయ్ అబ్బాయ్, జననీ జన్మభూమి, ఆదిత్య369, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, శ్రీరామరాజ్యం' వంటి చిత్రాలతో పాటు ఆయన వందో చిత్రంగా క్రిష్‌తో చేసిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' కూడా అదే కోవకి చెందిన చిత్రం. ఇక ఈయన దర్శకుల టాలెంట్‌ని తప్ప జయాపజయాలను పట్టించుకోడు. పరుచూరి మురళి, రవిచావలి, మహదేవ్, ఏఎస్ రవికుమార్ చౌదరి వంటి ఎందరికో ఈయన చాన్స్‌లు ఇచ్చాడు.
మరి బాలయ్య ప్రశాంత్ వర్మకి డేట్స్ ఇస్తాడో లేదో చూడాలి. మరో పక్క ప్రశాంత్ వర్మ వద్ద చిరంజీవి, బాలకృష్ణలకు సరిగా సూట్ అయ్యే మల్టీస్టారర్ స్టోరీ ఉందని చెబుతున్నాడు. చిరంజీవి, బాలకృష్ణలను ఒకే ఫ్రేమ్‌లో చూపించడం తన కల అని చెప్పాడు. గతంలో చాలా మంది ఈ కాంబినేషన్‌లో చిత్రం చేయాలని భావించి విఫలమయ్యారు. మరి ప్రశాంత్ వర్మ అయినా ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్‌లో తెరపై చూపించే అవకాశం ఉందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.