అతిలోక సుందరి శ్రీదేవికి దేశ విదేశాలలో ఎందరో వీరాభిమానులు ఉండవచ్చు. ఆమె దుబాయ్‌లో మరణించడంతో ఆమెని అభిమానించే ఆర్ధికస్థోమత కలిగిన వారు దుబాయ్‌కే నేరుగా వెళ్లున్నారు. ఓ గుజరాతీ వ్యక్తి శ్రీదేవి భౌతికకాయం చూసేందుకు దుబాయ్ వెళ్లి హోటళ్లలో రూమ్స్ దొరకపోవడంతో రాత్రంతా రోడ్డు పక్కనే పడుకున్నాడు. మరోవైపు ముంబైకి ఆమె మృతదేహాన్ని తేవడంలో జాప్యం జరుగుతున్నా కూడా రజనీకాంత్, వెంకటేష్‌లు మాత్రం ఇప్పటికే ముంబైకి చేరుకుని అనిల్‌కపూర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఇక శ్రీదేవికి వీరాభిమాని అంటే ఎవరైనా సరే ఠక్కున రాంగోపాల్‌వర్మ అని చెబుతారు. ఆమె మరణం సందర్భంగా ఆమెని, దేవుడిని ద్వేషిస్తున్నానని, శ్రీదేవికి కూడా మరణం ఉంటుందా? దేవుడికి దయలేదు. నేను ఆయన్ను ద్వేషిస్తున్నాను. ఇదే శ్రీదేవి గురించి ఇది నా చివరి ట్వీట్. ఇకపై శ్రీదేవి ఇంకా బతికే ఉన్నది అని భావిస్తూనే గడుపుతాను అని చెప్పి, ఆమెపై ఓ కవితను కూడా రాసి పోస్ట్ చేశాడు. తాజాగా వర్మ మరోసారి శ్రీదేవి విషయంలో వస్తున్న వార్తలు చూసి ఆయన ఉద్వేగానికి లోనై ఓ ట్వీట్ చేశాడు. ఇది చదివిన వారి గుండెలను తాకే విధంగా ఉంది.
శ్రీదేవి బతికి ఉన్నప్పుడు ఆమె అందం, శరీరం, హావభావాలు, సోయగాలు, ఆమె నడుం, పెదాల గురించి మాట్లాడుకున్న వారు ఇప్పుడు ఆమె గురించి ఏమేమో మాట్లాడుకుంటున్నారని అన్నాడు. ఆమె రక్తంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని, ఊపిరితిత్తుల నిండా నీరు చేరిందని ఇలా.., ఎవరి జీవితమైనా ఇంత భయంకరంగా, ఇంత విషాదంగా ముగుస్తుందా? అని వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.ఆమె మరణ వార్త గురించి ఇన్ని వాదనలు రావడం బాధాకరం, దురదృష్టకరం. ఇవ్వన్నీ చూస్తుంటే నన్ను నేను చంపేసుకోవాలని అనిపిస్తోందని ట్వీట్ చేశాడు.
ఇంతకాలం పెళ్లి, చావులంటే తనకు పట్టింపులేదని చెప్పిన వర్మ ఎంతలా ఫీలవుతున్నాడంటే.. ఆమె కుటుంబసభ్యుల కన్నా ఈయనే ఎక్కువగా బాధపడుతున్నాడు. ఈ షాక్ నుంచి బయటికి రావడానికి వర్మకి కొంత కాలం పట్టే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.