శ్రీదేవికి 'వేటగాడు' చిత్రంలోని ఎన్టీఆర్‌తో చేసిన 'ఆకు చాటు పిందె తడిసే' పాట ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతలు అంతా ఇంతా కాదు. ఇక ఈమె నటించిన 'వేటగాడు' చిత్రాన్ని రాంగోపాల్‌వర్మ థియేటర్‌లో చూస్తున్నప్పుడు ఈ పాట అయిపోగానే ఓ అభిమాని పైకి లేచి..'ఎట్లా పుట్టించినాడురా బాబూ..ఇంత గొప్ప అందాన్ని..వాడికి దణ్ణం పెట్టాలి' అని అరిచాడట. అది విన్న వర్మ దానినే దృష్టిలో ఉంచుకుని 'గోవిందా గోవిందా' చిత్రంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి 'ఓరి బ్రహ్మదేవుడో.. కొంప ముంచినావురో.. ఎంత గొప్ప సొగసురో.. ఏడ దాచినావురో' అని పాట రాయించాడట. ఇక శ్రీదేవి జపం చేస్తూ 'ప్రేమాభిషేకం'లో వచ్చిన 'దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా' అనే పాట కూడా అదే కోవలోకి వస్తుంది.
ఇక ఈమె భర్త బోనీకపూర్ విషయానికి వస్తే శ్రీదేవి ఆయనకు రెండో భార్య. మొదటి భార్య మోనాకపూర్ తన కుమారుడు అర్జున్ కపూర్‌ని హీరోగా వెండితెరపై చూడాలని ఆశ చెందింది. ఎంతో ఆత్రుతతో ఎంతో కష్టపడింది. కానీ అర్జున్ కపూర్ నటించిన మొదటి చిత్రం విడుదల కాకుండానే. తన కుమారుడిని వెండితెరపై చూడకుండానే ఆమె సినిమా విడుదలకు రెండు నెలల ముందు ఆమె కేన్సర్‌తో మరణించింది. ఆమె మరణంతో అర్జున్ కపూర్ నటించిన మొదటి చిత్రం ఆలస్యంగా విడుదలైంది. అలా 'ఇష్క్ జాదే' చిత్రాన్ని మోనా కపూర్ చూడలేకపోయింది. ఇక బోనీకపూర్ రెండో భార్య శ్రీదేవిని హీరోయిన్‌గా పెట్టుకుంటామని ఎందరో దర్శకనిర్మాతలు వచ్చి అడిగినా ఆమె నో చెప్పింది. వారిలో తెలుగు నిర్మాత, దర్శకులు, హీరోలు ఉన్నారు.
కానీ ఆమె తన పెద్ద కుమార్తె జాన్వికి సరైన ఫ్లాట్ ఫామ్ వేయాలని ఎంతగానో తపించిపోయింది. చివరకు 'సైరత్' రీమేక్‌కి ఓకే చెప్పి, కరణ్‌జోహార్ వంటి వారి సహాయం తీసుకుంది. 'దఢక్' పేరుతో ఈ చిత్రం జులై 14న విడుదల కావాల్సివుంది...! ఇలా తెరపై తమ వారసులను చూసుకోకుండానే బోనీకపూర్ ఇద్దరు భార్యలు దుర్మరణం చెందడం బాధాకరం.