అతిలోక సుందరి మరణాన్ని సినీ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు తట్టుకోలేకపోతున్నారు. తాము విన్నది అబద్దమని, ఆమె ఇంకా బతికే ఉందనే ఊహలో కొందరు ఉన్నారు. సాధారణంగా సినీ జనాలు, ప్రజలు ఆదివారాలను ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ నిన్న ఆదివారం మాత్రం ఎవ్వరిలో సంతోషాలు, ఆనందాలు లేవు. ఇక శ్రీదేవి ఎన్టీఆర్ సరసన బాలనటిగా నటించినప్పటికీ ఆమె 'వేటగాడు' చిత్రంలో ఆయన సరసన నటించింది. మొదట ఎన్టీఆర్ అలా ఆమెతో రొమాన్స్ చేస్తే చూడలేరేమో అని సందేహపడ్డారు. కానీ చిత్రం సాధించిన విజయంలో ఎన్టీఆర్‌తో పాటు శ్రీదేవి పాత్ర కూడా ఎంతో ఉంది. ఆ తర్వాత ఆమె అనేక చిత్రాలలో ఎన్టీఆర్‌తో నటించింది. ఇక ఏయన్నార్‌తో కూడా 'శ్రీరంగనీతులు' నుంచి 'ప్రేమాభిషేకం' సహా ఎన్నో చిత్రాలలో నటించింది. 'దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా..' అనే 'ప్రేమాభిషేకం'లోని పాట ఎవర్‌గ్రీన్.
ఆమె ఆ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆమె అందాన్ని, నటనను చూసి ఏయన్నార్ కూడా ఎంతో రొమాంటిక్‌గా ఫీలయ్యాడట. ఇక హృతిక్‌రోషన్ బాలనటునిగా మొదటి సారి వెండితెరపై నటించినప్పుడు ఆయన మొదటి సీన్ శ్రీదేవితోనే. ఇక హృతిక్ తండ్రి రాకేష్ రోషన్‌తో కూడా ఆమె మూడు చిత్రాలలో నటించింది. రిషికపూర్‌తో ఆమె చేసిన 'చాందిని, నగీన' ఎంతో పెద్దహిట్స్ అయ్యాయి. ఇక అమితాబ్‌తో ఐదు చిత్రాలలో నటించింది. మరోవైపు అమితాబ్, నాగార్జున కలిసి నటించిన 'ఖుదాగవా'లో ఆమె ద్విపాత్రాభినయం చేసింది. చిరంజీవితో 'జగదేకవీరుడు-అతిలోక సుందరి, ఎస్‌పీ పరుశురాం'లలో యాక్ట్ చేసింది. నాగార్జునతో 'ఆఖరిపోరాటం, గోవిందా గోవిందా'లలో నటిచింది. ఇక వెంకటేష్‌తో 'క్షణక్షణం' చేసింది. ఇక ఈమెకి కృష్ణ అంటే ఎంతో అభిమానం. బాలీవుడ్‌లో బిజీగా ఉన్న కాలంలో కూడా ఆమె ఎవరి చిత్రానికైనా నో చెప్పేది కాదు గానీ కృష్ణ అడిగితే నో అనేది కాదు.
ఇక తాజాగా మహేష్‌బాబు కూడా తాను శ్రీదేవి అభిమానినని చెప్పడమే కాదు.. తాను నటించిన 'అతిథి' చిత్రంలో తనకిష్టమైన అమ్మాయి శ్రీదేవినే అంటాడు. హీరోయిన్ అమృతారావుతో జరిగే సంభాషణలో నేను ఒకరిని ప్రేమించాను అంటాడు. హీరోయిన్ ఎంతో ఆతృతతో నీవు ప్రేమించే సుందరి ఎవరు ? అని అడిగితే మహేష్ శ్రీదేవి పేరు చెబుతాడు. సోషల్ మీడియాలో ఈ సీన్ వైరల్‌గా మారి శ్రీదేవి అభిమానులను కంటతడి పెట్టిస్తోంది.