శ్రీదేవిది మాతృభాష తమిళం అయినా, ఆమె పుట్టింది తమిళనాడులోని శివకాశిలో అయినా ఆమె తల్లి తిరుపతికి చెందిన మహిళ (రాజ్యలక్ష్మి) కావడంతో ఆమెను అందరు తెలుగు నటిగానే భావించారు. ఇక నాడు ఉన్న హీరో చంద్రమోహన్ సరసన ఎవరు హీరోయిన్‌గా నటిస్తే వారు స్టార్స్‌గా మారుతారనే సెంటిమెంట్ ఉండేది. అనుకున్నట్లుగానే సెంటిమెంట్ పరంగా శ్రీదేవి.. చంద్రమోహన్ సరసన నటించిన తర్వాతే టాప్ హీరోయిన్ అయింది. ఇక ఈమె తన 8వ ఏట తెలుగులో 'యశోదకృష్ణ' చిత్రంలో చిన్నారి కృష్ణుడి వేషం వేసింది. అందులో చంద్రమోహన్ నారదుని పాత్రలో నటించాడు. నాడు చిన్నతనంలో కూడా శ్రీదేవి ఎంతో క్రమశిక్షణతో ఉండేదని, ఖాళీ సమయాల్లో బిస్కెట్స్ తింటూ ఉండేదని, ఆమెని చూసి నాడు ఆమె పెద్ద స్టార్‌హీరోయిన్ అవుతుందని తాను భావించానని చంద్రమోహన్ చెబుతూ ఉంటాడు.
ఇక ఆమె 'యశోదకృష్ణ' షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత మరో షూటింగ్ కోసం చెన్నై వెళ్లాల్సి వచ్చింది. కానీ ట్రైన్‌లో టిక్కెట్లు దొరకలేదు. అప్పుడు ఆమె తల్లి రాజ్యలక్ష్మి.. చంద్రమోహన్ వద్దకు వచ్చి మద్రాస్‌లో షూటింగ్ ఉంది. కాస్త మా అమ్మాయిని మీ కారులో తీసుకుని వెళ్లగలరా? అని అడిగింది. దానికి చంద్రమోహన్ ఒప్పుకున్నాడు. ఈ 14 గంటల ప్రయాణంలో ఆమె తన ఒడిలో నిద్రిస్తూ ఉండిపోయింది. నాడు ఆమె మరో మూడేళ్ల తర్వాత తన సరసన హీరోయిన్‌గా నటిస్తుందని ఊహించలేకపోయాను. ఇక 'పదహారేళ్ల వయసు' చిత్రంలో మొదట దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకోవాలని భావించాడు. కానీ చాలా మంది వద్దు అన్నారు. కానీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌లో కమల్‌హాసన్ సరసన కూడా ఆమె ఎంతో బాగా నటించిందని చెప్పి రాఘవేంద్రరావు ఆమెనే తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమె అద్భుతంగా నటించింది. దీనితో ఆమె ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయిపోయింది....!