ఆదివారం తెల్లవారకుండానే రామ్ గోపాల్ వర్మకు దిమ్మతిరిగిపోయే షాకింగ్ న్యూస్. అతను ఇంత తొందరగా ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించి ఉండడు. ఎందుకంటే శ్రీదేవి అంటే అతనికి అంత అభిమానం, ఆరాధన, ప్రాణం. శ్రీదేవిని అభిమానించినంతగా మరో హీరోయిన్ ను అభిమానించి ఉండడు. వర్మ కలల రాణి శ్రీదేవి. అలాంటి శ్రీదేవి చనిపోయిందన్న వార్త వర్మను షాక్ కు గురిచేసింది. 1989లో నాగార్జునతో 'శివ' సినిమా చేసి దర్శకుడుగా పరిచయమయ్యాడు వర్మ. ఆ తరువాత 1991లో 'క్షణక్షణం' చిత్రంలో వెంకటేష్ పక్కన తనకు అత్యంత ఇష్టమైన అతిలోక సుందరి శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకున్నాడు. అనునిత్యం ఆరాధించే శ్రీదేవి తన ఎదురుగా ఉంటే ఆమెను చూస్తూ ప్రపంచాన్నే మరిచిపోయేవాడు.
ఆనాడు 1996 లో శ్రీదేవి బోణి కపూర్ ని పెళ్ళాడడంతో ఎంతమంది శ్రీదేవి అభిమానులు తల్లడిల్లారో సరిగ్గా గుర్తులేదు గాని... రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎంత తల్లడిల్లాడో అనేక ఇంటర్వూస్ లో లైవ్ లోనే చెప్పాడు. అప్పట్లో శ్రీదేవిని అంతలా ఆరాధించిన వర్మ... శ్రీదేవి, బోని కపూర్అని పెళ్లాడటం అస్సలు నచ్ఛలేదు. అందుకే శ్రీదేవిని బోని కపూర్ ని వదిలెయ్యమని కోరుకుంటున్నా కూడా చాలాసార్లు వర్మ పలు సంచలన వ్యాఖ్యలు చేసాడు. అందరికి దేవతలా ఉన్న శ్రీదేవి బోని కపూర్ ని పెళ్ళాడి అతనికి సేవలు చెయ్యడం తనకి నచ్చలేదని.... అందరి ఆరాధ్య దేవత గృహిణిగా మారి సినిమా ప్రపంచాన్ని వదిలెయ్యడం అందరి గుండెల్ని పిండేసిందని.. అబ్బో వర్మ శ్రీదేవి విషయంలో ఇలా ఎన్నో సంచలనాత్మక మాటలు మాట్లాడేవాడు.
అంతలా శ్రీదేవిని ఆరాధించిన వర్మ.. శ్రీదేవి మరణ వార్తను అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. తనకు నిద్రలో లేచి ఫోన్ చూసుకునే అలవాటని.... ఈరోజు తెల్లవారుజామున కూడా ఫోన్ చూసిన తనకి శ్రీదేవి మరణ వార్తను నమ్మలేని నిజంగా అనిపించిందని... అయినా శ్రీదేవి చనిపోవడం ఏమిటని షాక్ అయ్యానని.. తర్వాత తనది కల కాదు నిజమని తెలిసేసరికి గుండె బద్దలైంది... మొదటి సారి శ్రీదేవిని తీసుకెళ్ళిపోయినందుకు దేవుణ్ణి ద్వేషిస్తున్నానని... మొదటిసారి నువ్వు ఇలా నింగికెగసినందుకు నిన్ను ద్వేషిస్తున్నానని ... ఎంతగా నిన్ను ఇప్పుడు ద్వేషించినా...నా చివరి శ్వాస వరకు నిన్ను పేమిస్తూనే ఉంటానని... శ్రీదేవి మరణంతో కలత చెందిన రామ్ గోపాల్ వర్మ మనసుకు హత్తుకునేలా ట్వీట్ చేసాడు. తన దేవత ఇలా అకాల మరణం చెందడం అనేది ఇప్పటికి తట్టుకోలేని వార్త అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు వర్మ.