అలనాటి మేటి అగ్రతార శ్రీదేవి ఆదివారం తెల్లవారి జామున దుబాయ్ లోని బంధువుల పెళ్ళిలో హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం ఎవ్వరు జీర్ణించుకోలేని విషయం. 54 ఏళ్లకే శ్రీదేవి ఇలా తనువు చలించడం ఎవరూ నమ్మలేకపొతున్నారు. శ్రీదేవి అభిమానులు, ఆమెతో నటించిన హీరోల దగ్గర నుండి శ్రీదేవితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్క నటీనటులు ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎం ల దగ్గరనుండి ప్రధాని మోదీ వరకు శ్రీదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. పలు భాషల్లో అగ్రతారగా చక్రం తిప్పిన శ్రీదేవి 1996 లో బాలీవుడ్ దర్శకనిర్మాత బోనికపూర్ ని పెళ్ళాడి సంసారం బాధ్యతల్లో 2012 వరకు మునిగిపోయి వుంది. మళ్ళీ 2012 లో వెండితెర మీద ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్లకు పోటీగా రెడీ అవుతూ అనేక ఫంక్షన్స్ కి హాజరవుతూ చలాకీగా ఉండే శ్రీదేవి ఈ రోజు లేదంటే ఎవరూ నమ్మలేకపొతున్నారు.
1967 నుండి 1997 నాటి కాలంలో అగ్రతారగా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన శ్రీదేవి కి తెలుగు, హిందీ భాషల్లో జయప్రద గట్టి పోటీ ఇచ్చేది. కేవలం పోటీ మాత్రమే కాదు శ్రీదేవి తో సై అంటే సై అనడానికి జయప్రద సిద్ధంగా ఉండేది. వారి మధ్య అప్పట్లో అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేది అనేవారు. అయితే వీరిదారికి మధ్య రాజి కుదుర్చి స్నేహితులుగా మర్చడానికి బాలీవుడ్ హీరోలైన జితేంద్ర, రాజేష్ ఖన్నా లు శ్రీదేవిని, జయప్రదని ఒకే గదిలో ఉంచి తాళం వేసి కొద్దీ సేపు అలానే వదిలేశారట. కానీ ఒకే గదిలో ఉన్నాసరే శ్రీదేవి, జయప్రదకు ఉన్న ఈగో వలన అసలు మాట్లాడుకోకుండా మౌనంగానే కూర్చున్నారట. ఆ గది తాళం తీసేవరకు శ్రీదేవి గాని జయప్రద గాని మాట్లాడుకోలేదంటేనే వారిమధ్య ఈగో ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. ఏది ఎలా ఉన్నా శ్రీదేవి తన కూతురు జాన్వీ తెరంగేట్ర సినిమా విడుదల కాకముందే.. ఇలా వెళ్లిపోవడం మాత్రం కాస్త బాధాకర విషయమే.