అంగవైకల్యాలు ఉన్న వారిని హేళన చేయడం కూడా తప్పే. వీలుంటే వారికి ఏదైనా సాయం చేయాలే గానీ వారిపట్ల ఆటవికంగా ప్రవర్తించడం తప్పు. ఇక అన్ని వైకల్యాలు ఒక ఎత్తైతే మానసిక వైకల్యం మరో ఎత్తు. మిగిలిన దివ్యాంగులు ఏదైనా అవయవం బాగా లేకపోయినా తమ మానసిక దృడత్వంతో దానిని అధిగమించగలరు. కానీ మానసిక వికలాంగుల విషయానికి వస్తే వారికి మిగిలిన అన్ని అవయవాలు బాగున్నా, ఎంత అందగళ్ళైనా, ఎంత గొప్పవారైనా కూడా వారికి మిగిలిన ఏమీ సరిగా ఉండవు. కాబట్టి వికలాంగులలో మానసిక వికలాంగుల పరిస్థితి దౌర్భాగ్యం.
ఇక తాజాగా కేరళలో మానసిక స్థిమితం లేని ఓ వ్యక్తిని దొంగతనాలు చేస్తున్నాడనే నెపంతో కొందరు వ్యక్తులు తీవ్రంగా కొట్టి, చెట్టుకు కట్టేసి కొట్టారు. ఇంతకీ ఆ బాధితుడు చేసిన నేరం ఏమిటంటే ఆకలిని తట్టుకోలేక తినే వస్తువులను దొంగతనం చేశాడు. అతడిని తీవ్రంగా కొట్టిన వారు ఆ వ్యక్తిని కొడుతూ, సెల్ఫీలు కూడా దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆ కొట్టిన వారి పట్ల ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. చివరకి ఆ వ్యక్తిని పోలీసులు హాస్పిటల్‌లో చేర్పించినా కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆయన మరణించాడు. ఆ వ్యక్తిపేరు మధు. దీనిపై మమ్ముట్టి తన ఫేస్‌బుక్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చనిపోయిన వ్యక్తి తన సోదరుడు వంటివాడని, మనుషులుగా ఆలోచిస్తే అతడిని కొట్టి చంపిన నిందితులకు కూడా ఆయన సోదరుడు, కుమారుడు వంటి వాడేనని తెలిపాడు.
ఆకలి కోసం దొంగతనం చేస్తే దానిని దొంగతనంగా పరిగణించకూడదని, అతడికి హక్కులు ఉంటాయని, పేదరికం అనేది సమాజమే సృష్టించిందని అభిప్రాయపడ్డాడు. ఏది ఏమైనా ఒక వ్యక్తిపై భౌతిక దాడులు చేసి కొట్టడం తప్పు అని చెబుతూ, సారీ మధు అని పోస్ట్ చేశాడు. ఈ విషయంలో మమ్ముట్టి చెప్పింది అక్షరసత్యం.