త్వరలో రాజకీయ పార్టీని అనౌన్స్ చేయనున్న సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు మద్దతు తెలుపుతూ, తమిళనాడులోని రాజకీయ పార్టీల నాయకులకు ఘాటుగా సమాధానం చెప్పాడు. తన అభిమానులకు ఎవ్వరూ రాజకీయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదని, తన అభిమానులే రాజకీయ నాయకులకు పాఠాలు చెప్పగలరని వ్యాఖ్యానించాడు. రజనీ గురించి టి.రాజేంద్రన్, భాగ్యరాజా, సత్యరాజ్, శరత్‌కుమార్, భారతీరాజా వంటి వారు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించే రజనీ ఈ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎవ్వరినీ కించపరచని, ఎవరి గురించి చెడుగా మాట్లాడని రజనీకాంత్ ఈ వ్యాఖ్యల ద్వారా తాను కూడా మానసికంగా మారుతున్న సంకేతాలను ఇచ్చాడు. చెన్నైలో జరిగిన ప్రజాసంఘాల సమావేశంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక తన పార్టీ 32 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన అభిమాన సంఘాల నుంచి ఉద్భవిస్తున్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని సూచించారు. జిల్లాల ఇన్‌చార్జ్‌లను నియమించిన తర్వాత తాను రాష్ట్ర వ్యాప్త యాత్ర చేస్తానని, తన పార్టీని ఇప్పుడు బలోపేతం చేయడం మాత్రమే తమ ముందున్న లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. కమల్ రాజకీయపార్టీ ప్రకటనను, సభను చూశానని, కమల్, తన దారులు వేరైనా తమ లక్ష్యం మాత్రమే ఒకటేనని.. ఆయన కమల్‌కి అనుకూలమైన వ్యాఖ్యలు చేశారు. ఇక రజనీ నటించిన 'కాలా, 2.0' చిత్రాలు రెండు ఇదే ఏడాది విడుదల కానున్నాయి. 'కాలా' చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుండగా, '2.0' స్వాతంత్య్రదినోత్సవం రోజైన ఆగష్టు15న గానీ లేదా దీపావళి కానుకగా గానీ విడుదల కానుంది.
ఇక రజనీ రాజకీయాలలోకి వస్తున్నాడు కాబట్టి ఆయన ఇక సినిమాలు చేయకపోవచ్చని పలువురు భావిస్తున్న వేళ ఆయన తన చివరి చిత్రంగా తన పొలిటికల్ మైలేజ్‌కి ఉపయోగపడే చిత్రం చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు తదుపరి రజనీ నటించే చిత్రం కూడా ఖరారైంది. డీఎంకేకి చెందిన సన్ పిక్చర్స్ బేనర్‌లో 'పిజ్జా, ఇరైవి' వంటి చిత్రాల ద్వారా ప్రశంసలు అందుకున్న కార్తీక్‌సుబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. సన్ పిక్చర్స్‌కి చెందిన కళానిధి మారన్ నిర్మించే చిత్రం కావడంతో ఇది భారీ బడ్జెట్‌తో, రజనీ పొలిటికల్ మైలేజ్‌కి ఉపయోగపడేలా రూపొందనుంది. మరి ఇది సడన్‌గా ముందుకొచ్చిన ప్రాజెక్టా? లేక రజనీ ముందుగా కమిట్ అయిన ప్రాజెక్టా? అన్న విషయంలో పలు వాదనలు వినిపిస్తున్నాయి.