నిజానికి త్రివిక్రమ్ మంచి రచయిత, దర్శకుడే కాదు.. సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఆయన హవా నాడు సాగింది. కానీ 'అజ్ఞాతవాసి'తో మాత్రం బోల్తాపడ్డాడు. ఈ సినిమా ఆయనపై చూపిన ప్రభావం ఇంతవరకు ఏ దర్శకునిపై కూడా పడలేదన్నది వాస్తవం. 'స్పైడర్'వంటి డిజాస్టర్ ఉన్నా కూడా అది దర్శకునిగా తప్పుగా, నిర్లక్ష్యంగా చూడలేం. ఓ ప్రయోగం చేస్తే ఫెయిల్ అయింది అని మాత్రమే భావించగలం. కానీ 'అజ్ఞాతవాసి' సినిమా స్టోరీ కాపీ చేయడం నుంచి చిత్రీకరణ, డైలాగ్స్‌లలో త్రివిక్రమ్ నిర్లక్ష్యం కనిపించింది. దాంతో ఆయన విమర్శకులకు టార్గెట్ అయ్యాడు. 'ఖలేజా' ఫ్లాప్ అయినా కూడా పట్టించుకోని వారు ఈ చిత్రం విషయంలో త్రివిక్రమ్‌ని ఓ ఆటాడుతున్నారు. ఇక దీంతో ఆయన తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తో చేసే చిత్రం డౌటేనని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. ప్రస్తుతం వరస హిట్స్‌లో ఉన్న ఎన్టీఆర్ పూరీతో 'టెంపర్', బాబితో 'జై లవకుశ' వంటి చిత్రాలను కూడా ఫ్లాప్ డైరెక్టర్స్‌తోనే చేశాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం ముందుగా ఎన్టీఆర్‌కి అనుకున్న స్క్రిప్ట్‌కి ఎన్నో మార్పులు చేర్పులు చేసి రీరైట్ చేసి, లోపాలు లేకుండా చూసుకుంటున్నాడట.
మరోవైపు 'అజ్ఞాతవాసి' ద్వారా దెబ్బతిన్న బయ్యర్లకు నిర్మాత, హారికా హాసిని అధినేత, చిన్నబాబు ఈ చిత్రం రైట్స్‌ని తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి ఉన్నాడు. సో... ఇప్పుడు ఈ ముగ్గురికి పెద్ద విజయం కీలకం. ఇక 'అత్తారింటికి దారేది'లో నదియా, 'అజ్ఞాతవాసి'లో ఖుష్బూలను కీలకంగా చూపించిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ చిత్రంలో కూడా అలాంటి తరహా పాత్రను తీర్చిదిద్దుతున్నాడని సమాచారం. మరి ఆ పాత్రకు ఏ సీనియర్ నటిని తీసుకుంటాడో అనే ఆసక్తి మొదలైంది. ఈ లిస్ట్‌లో శ్రీకాంత్ శ్రీమతి ఊహ, త్రివిక్రమ్ రచయితగా తన పేరుతోనే ఓన్‌గా వర్క్ చేసిన మొదటి చిత్రం 'స్వయంవరం' హీరోయిన్ లయలను ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కూడా విదేశీ ట్రైనర్ సాయంతో 'బృండావనం' లుక్‌లోకి రావడానికి బాగా కష్టపడుతున్నాడు. సంగీత దర్శకునిగా అనిరుద్‌ని తీసేసి తమన్‌ని, సినిమాటోగ్రాఫర్‌గా కూడా వినోద్‌ని పెట్టుకున్నారని సమాచారం.
ఇక ఈ చిత్రం టైటిల్‌ని ఇందులోని ఎన్టీఆర్ పేరుతో పెట్టి, క్యాప్షన్‌గా మాత్రం 'ఆన్ సైలెంట్ మోడ్' అనే దానిని పెట్టనున్నారట. నిజానికి త్రివిక్రమ్‌కి టైటిల్స్ పెట్టడంలో ఓ ప్రత్యేకశైలి ఉంది. కానీ ఆయన పవన్‌తో తీసిన సినిమాకి మాత్రం 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ మొదటి నుంచి మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు.