మన పెద్దలు మాటలో కాదు చేతలో తాము చేయాల్సింది చేసి చూపాలని అంటారు. కానీ మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ మాత్రం ఇంటర్వ్యూలలో కావాల్సినన్ని కబుర్లు చెబుతున్నాడు గానీ సినిమాల విషయానికి వస్తే దెబ్బై పోతున్నాడు. ఇటీవల వచ్చిన 'ఇంటెలిజెంట్' చిత్రం ఓపెనింగ్స్, ఫలితం చూస్తే ఆయన ఏమి చూసి చిత్రాలు చేస్తున్నాడో అనే అనుమానం కలుగుతోంది. ఇక మెగాభిమానులు కూడా రామ్‌చరణ్ కాకుండా వరుసగా తన పెదమామయ్య చిరంజీవి, చినమావయ్య పవన్‌కళ్యాణ్‌లను అనుకరించడం, వారి పాటలను, వారిస్టైల్‌ని చూపించడంతో సాయి అంటే మండిపడుతున్నారు. దాంతో ఆయన తన తదుపరి చిత్రంగా కరుణాకరన్‌తో చేస్తున్న చిత్రంలో మాత్రం మావయ్యల రిఫరెన్స్‌లు లేకుండా జాగ్రత్త పడుతున్నాడట. మరో వైపు ఈ చిత్రం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోణం నుంచి సాగుతుందని, ఇందులో సాయిది ఆమెతో లింక్ అయిన పాత్ర మాత్రమే అని అంటున్నారు.
ఇక తాజాగా సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ.. మా అమ్మ అంటే మాకు ప్రాణం. ఆమె మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది. ఆమె అంటే మాకెంతో గౌరవం, ఫ్రీడమ్ కూడా ఉంది. నేను పాస్ అయినా, ఫెయిలయినా అమ్మకి నిజం చెప్పేస్తాను. ఇక ప్రేమించినా, ప్రేమ ఫెయిల్ అయినా కూడా ఓపెన్‌గా విషయం చెబుతాను. ఇక నేను పార్టీలలో మందు తాగుతానని కూడా మా అమ్మకి చెబుతాను. అయితే ఆమె మాత్రం మరీ ఎక్కువగా డ్రింక్ చేయవద్దు, డ్రింక్ చేసినప్పుడు వాహనం నడపవద్దు అని సూచనలు ఇస్తుందన్నాడు. మరి ఇలాంటి అమ్మే అందరికీ ఉండే ఎంత బాగున్నో అనిపిస్తోంది కదూ...!
మరోవైపు నాకు మా మామల ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఆశీస్సులు చాలు గానీ వారి పేరు ఎక్కడా చెప్పుకోకూడదని భావించాను, ఓ రోజు మంచు మనోజ్‌తో క్రికెట్ ఆడుతుంటే వైవిఎస్ చౌదరి నన్ను చూసి నటిస్తావా? అని అడిగారు. ఆయనకు నేను చిరంజీవి మేనల్లుడిని అని తెలియదు. ఇక 'కేరింత' ఆడిషన్స్‌కి వెళ్లితే 'పిల్లా నువ్వులేని జీవితం' చాన్స్ వచ్చింది. వీరెవ్వరికి నేను చిరంజీవికి ఏమవుతానో చెప్పలేదు. నా సొంత ప్రతిభతోనే ఈ స్థితికి వచ్చాను.
'రేయ్' చిత్రం చాలా ఆలస్యమైంది. హఠాత్తుగా శ్రీహరి చనిపోవడంతో ఆయన పార్ట్‌ని రీషూట్ చేయాల్సి వచ్చింది. నాడు అందరు నన్ను ఐరన్‌లెగ్ అన్నారు. దాంతో బాధపడ్డాను. కానీ సిరివెన్నెల రాసిన 'ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి' అనే పాట నాకు ఇన్‌స్పిరేషన్ కలిగించి, నాలో ధైర్యాన్ని నింపింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకాలం తేజుని.. పవనే, వైవిఎస్ చౌదరి చేతిలో పెట్టాడని వార్తలు వస్తుంటే ఇప్పుడు తేజు మాత్రం వైవిఎస్‌చౌదరి తనని చూసే హీరోని చేశాడని, తానేమీ తన బ్యాక్‌గ్రౌండ్‌ని ఏమీ వాడుకోలేదని చెబుతుండటం విశేషం.