ఐఏయస్ ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి లోక్‌సత్తా సంస్థను స్థాపించి, తర్వాత దానిని పోలిటికల్ పార్టీగా జయప్రకాష్ నారాయణ్ మార్చాడు. ఢిల్లీతో పాటు పలు చోట్ల జెపి తరహా చరిత్రే ఉన్న కేజ్రీవాల్ కి, ఆయన ఆప్ పార్టీకి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. అలా తనను తాను రాజకీయ నాయకునిగా ప్రొజెక్ట్ చేసుకుని, ఢిల్లీ సీఎం పీఠం సైతం కేజ్రీవాల్ దక్కించుకున్నాడు. కానీ జెపి మాత్రం రాజకీయంగా విఫలమయ్యాడు. ఎంతో మేధావి, మంచి వాక్పటిమ ఉన్న జెపి అంటే అందరికీ ఇష్టమే. కానీ ఆయనకు మాత్రం ఓటు వేయరు. ఇది బహు చిత్రం. ఇక కిందటి ఎన్నికల్లో జెపి నిలబడిన ఎంపీ స్థానంలో జనసేనాధిపతి పవన్ ఆయనకు అనుకూలంగా ప్రచారం చేయాలని భావించాడు. కానీ మిత్రధర్మం ప్రకారం టిడిపి అభ్యర్దినే బలపరిచాడు.
ఇక విషయానికి వస్తే త్వరలో మూడు రాజ్యసభ ఎంపీస్థానాలు ఆంద్రా నుంచి ఖాళీ అవుతాయి. వీటిల్లో రెండు టిడిపికి, ఒకటి వైసీపీకి దక్కుతుంది. వైసీపీ అభ్యర్దిగా ఆల్‌రెడీ ప్రముఖ పారిశ్రామికవేత్త, నెల్లూరు వాసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీ ప్రకటించింది. ఇక చంద్రబాబు తమ అభ్యర్దుల విషయంలో సర్వే చేయిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన జయప్రకాష్ నారాయణ్‌ని రాజ్యసభ ఎంపీగా పంపాలనే యోచనలో ఉన్నాడు. సర్వేలో కూడా అందరు ఎమ్మెల్యేలు జెపికి మద్దతుగా నిలిచి, ఎవ్వరూ వ్యతిరేకత చూపలేదు. మరోసారి చిరంజీవిని టిడిపి తరపున రాజ్యసభకి పంపాలని భావించినా, ఆయన ఎంపీగా ఉన్న ఇంత కాలంలో రాష్ట్రానికి ఏమీ చేయలేదని, కనీసం రాజకీయాలలో కూడా చురుగ్గా లేకుండా, తన సినిమాలతో బిజిగా ఉన్నాడని వ్యతిరేకత వ్యక్తమైందట.
చిరుని రాజ్యసభకి పంపాలని పవన్ కూడా చంద్రబాబుని కోరినట్లు వినిపిస్తోంది. మొత్తానికి రెండో స్థానం కోసం ఎవరిని ఎంచుకుంటారో గానీ మొదటి అభ్యర్దిగా జెపిని రాజ్యసభకి పంపితే, పెద్దల సభగా రాజ్యసభకే గౌరవం లభిస్తుందనడంలో సందేహం లేదు. ఇక జెపిని రాజ్యసభకి పంపడానికి పవన్ కూడా సిద్దమే. జెపి అంటే పవన్‌కి కూడా ఎంతో ఇష్టం. జెఎఫ్‌సిలో కూడా జెపి ఉన్న విషయం తెలిసిందే. ఈయన వివాద రహితుడుగా కూడా గమనార్హం.