బ్రహ్మానందం సమకాలీనులైన సీనియర్ కమెడియన్లు అందరు వరుసగా దివికేగుతున్నారు. ఇక గుండు హనుమంతరావు విషయానికి వస్తే ఆయన కూడా బ్రహ్మానందం నటించిన 'అహనా పెళ్లంట' ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎస్వీకృష్ణారెడ్డి చిత్రాలలో తనదైన సహజసిద్దమైన హాస్యంతో అలరించాడు. కానీ ఆయన భార్య ఇంట్లో పడిపోయి కోమాలోకి వెళ్లడంతో ఆమెని బతికించుకునేందుకు గుండు హనుమంతరావు తాను సంపాదించినదంతా వైద్యానికి పెట్టాడు. కానీ ఆమె మరణించింది. మరోవైపు ఆయన కూతురు కూడా మరణించడం మరోషాక్.
కానీ గుండు హనుమంతరావు కుమారుడైన ఆదిత్య మాత్రం యూఎస్‌లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. తండ్రి కిడ్నీ వ్యాధితో, డయాలసిస్‌తో బాధపడుతుండటంతో ఉద్యోగం వదిలేసి వచ్చి తండ్రికి సేవ చేస్తూ ఉన్నాడు. ఇక గుండు ఆర్ధిక పరిస్థితి కూడా బాగాలేని విషయాన్ని మొదటగా కమెడియన్ అలీనే టీవీ షో ద్వారా అందరికీ తెలిపే ప్రయత్నం చేశాడు. దాంతో చిరంజీవి రెండు లక్షలు, తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షలని ఆయనకు ఇచ్చాయి. అయినా ఆయన తాజాగా మరణించాడు.
దీంతో ఆయన కుమారుడు ఆదిత్య తల్లి, తండ్రి, సోదరి ఎవ్వరూ లేకుండా ఒంటరిగా మిగిలాడు. దాంతో అలీతో పాటు బ్రహ్మానందం గుండు కుమారుడి ఉద్యోగం, పెళ్లి వంటి బాధ్యతలన్నీ తీసుకున్నారని సమాచారం. ఇదే నిజమైతే పెద్ద మనసు చాటుకున్న బ్రహ్మానందం, అలీలను అభినందించాలి. ఇదే నిజమని టాలీవుడ్‌లో ప్రచారం ఉంది. దాంతో వీరిద్దరిపై అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.