వైవిధ్య చిత్రాలు, అందులోని తమ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసేందుకు, పాత్రకి తగ్గట్లుగా మేకోవర్ అయి పాత్రల్లో లీనమవ్వడంలో కమల్‌హాసన్, విక్రమ్, అమీర్‌ఖాన్, సూర్య, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి వారిని ప్రముఖంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ కండలవీరుడు హృతిక్‌రోషన్ కూడా చేరిపోయాడు. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకుని, తన కెరీర్ స్టార్టింగ్‌లో తన రూపురేఖలు, కండలు, అద్బుతమైన డ్యాన్స్‌తో ఆయన కమర్షియల్ చిత్రాలలో నటించి బ్లాక్‌బస్టర్స్‌ని అందుకున్నాడు. ఇక ఇటీవల 'కాబిల్' అనే వైవిధ్య చిత్రంలో గుడ్డివాని పాత్ర చేసి మెప్పించి, పాత్రలో ఒదిగిపోయాడు. అయితే అదే రోజున షారుఖ్‌ఖాన్ నటించిన పక్కా కమర్షియల్ చిత్రం 'రాయిస్' విడుదల కావడం, విజయం సాధించడంతో 'కాబిల్'కి సరైన కలెక్షన్లు లభించక అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.
ప్రస్తుతం ఆయన మరో ప్రయోగం చేస్తున్నాడు. పాట్నాకి చెందిన ప్రముఖ గణితశాస్త్ర నిపుణులు, సూపర్ 30కోచింగ్ సెంటర్ అధినేత అయిన ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందుతున్న 'సూపర్ 30'లో ఆయన ఆనంద్ కుమార్ పాత్రను పోషిస్తున్నాడు. ఎన్నో కష్టాలు, పేదరికం నుంచి వచ్చిన ఆనంద్ కుమార్ తనకి లక్షల్లో పారితోషికం ఇస్తామని చెప్పినా కూడా ఏ సంస్థలోనూ పని చేయకుండా ప్రతి ఏడాది మంచి ప్రతిభ కలిగి, పేదలైన 30 మంది విద్యార్ధులకు ఐఐటి శిక్షణ ఇస్తుంటాడు. ఈ చిత్రానికి వికాస్‌భల్ దర్శకత్వం వహిస్తుండగా, హృతిక్‌రోషన్‌తో పాటు మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక ఆనంద్ తన జీవనం గడపడం కోసం ఎంతో కాలం అప్పడాలు కూడా అమ్మాడు. ఇప్పుడు అవే సీన్స్‌ని హృతిక్‌రోషన్‌పై జైపూర్‌లో చిత్రీకరిస్తున్నారు.
ఇందులో బక్కపలచగా మారి, నలిగి పోయిన నూలు వస్త్రాలు ధరించి, భుజంపై కండువా కప్పుకుని చింపిరి జుట్టుతో సైకిల్ మీద అప్పడాలు అమ్ముతూ హృతిక్ కనిపిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి హృతిక్ చేస్తున్న ఈ ప్రయోగం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుందాం.