తాజాగా లోకనాయకుడు, యూనివర్శల్ స్టార్ అయిన కమల్‌హాసన్ రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈయన తన పార్టీ పేరుగా 'మక్కల్ నీది మయమ్'గా ప్రకటించాడు. సాధారణంగా తమిళనాట ఏ కొత్త పార్టీ ప్రారంభమైన కూడా ద్రవిడ అనే పదం ఆనవాయితీగా వస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే ఇలా ప్రతి చోటా ఇదే వరస. దీనికి కమల్ హాసన్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. కమల్ స్థాపించిన పార్టీ మీనింగ్ పీపుల్స్ జస్టిస్ పార్టీ అని అర్ధం. అంటే ప్రజలకు న్యాయం చేసే పార్టీ అని అర్ధం. ఇక దీని సౌండింగ్‌తో పాటు లోగో కూడా విభిన్నంగానే ఉంది. పవన్ 'జనసేన' లోగో తరహాలోనే ఇది కూడా ఉండటం విశేషం. ఇక ఎరుపు రంగుని చూపించడం ద్వారా తనలోని వామపక్ష భావాలను కమల్ ప్రకటించుకున్నాడు. ఐకమత్యానికి సింబాలిక్‌గా చేతులు కలిపిన లోగోను వృత్తాకారంలో ఉంచారు. ఆ మధ్యలో ఓ నక్షత్రాన్ని కూడా పొందుపరిచాడు.
'నేను మీలోంచి వచ్చిన వ్యక్తిని, నేను తలైవాను కాను. ఒక్కరోజు ఆట కోసం రాజకీయాలలోకి రాలేదు. నన్ను నేను నాయకుడిగా భావించుకోవడం లేదు. సామాన్య జనం నుంచి పుట్టుకొచ్చిన వాడిని, ప్రజాసేవకుడిగా ఉండాలని భావిస్తూ ముందుకొచ్చాను. ప్రజలకు ఎల్లప్పుడు జవాబు దారిగా ఉంటానని చెప్పి తనకు చంద్రబాబునాయుడే స్ఫూర్తి అని ప్రకటించాడు. ఇక ఈయన రామేశ్వరం నుంచి మధురై వచ్చి బహిరంగసభ నిర్వహించాడు. మదురై అనేది ఎమ్జీఆర్, జయలలిత, విజయ్‌కాంత్ వంటి వారందరూ సెంటిమెంట్‌గా భావిస్తారు. వారందరు తమ ప్రస్థానాన్ని అక్కడి నుంచే ప్రారంభించడమే కాదు. ఆ చుట్టుపక్కల నుంచే పోటీ చేసి విజయం సాదించారు. ఇక మధురై పక్కనే కమల్ జన్మస్థలం కూడా. ఇక మధురైలో కమల్‌ని బాగా ఆరాదించే దేవర్‌లు ఎక్కువ.
ఇక తాను హేతువాదిని అని చెప్పుకునే కమల్ తన రాజకీయ ముహూర్తాన్ని మాత్రం పలు సెంటిమెంట్ల ప్రకారమే చేసుకున్నారు. నేను నాస్తికుడిని, దేవుళ్ల పూజలపై నమ్మకం లేదని చెబుతాడు. కమల్ పార్టీ ప్రకటించింది ధరణి నక్షత్రంలో. ఆ నక్షత్రంలో పుట్టిన వారు ధరణిని ఏలుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక తిధి కూడా షష్టి ఆయనకు కలసివచ్చేదే కావడం విశేషం, దాని వల్లనే ఆయన ఈ ముహూర్తాన్ని ఎంచుకున్నాడు.