అశ్లీల పోర్న్ స్థాయి షార్ట్ ఫిల్మ్‌గా రాంగోపాల్‌వర్మ తీసిన 'జీఎస్టీ' వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఈ శుక్రవారం కూడా విచారణలో పాల్గొనాలని వర్మని పోలీసులు ఆదేశించారు. మరోవైపు వర్మ చేత అవమానింపబడిన సామాజిక కార్యకర్త దేవి, ఐద్వా నాయకురాలు మణిలు క్షమాపణలతో వదిలేది లేదని, ఖచ్చితంగా వర్మకు శిక్ష పడాల్సిందే అంటున్నారు. మరోవైపు వర్మ తాను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయలేదని కొత్త రాగం అందుకున్నాడు. ఇక పోలీసులు తాజాగా ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్‌ని కూడా విచారించాలని నిర్ణయించారు. దీంతో ఈ చిత్రానికి పని చేసిన సంగీత దర్శకుడు కీరవాణి నుంచి వర్మ అసిస్టెంట్ల వరకు అందరికీ నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారట.
ఇక కీరవాణి విషయానికి వస్తే ఆయన వర్మతో 'క్షణక్షణం' చిత్రానికి పనిచేశాడు. 'అంతం' చిత్రానికి కూడా కొంత భాగం వర్క్ చేశాడు. తాజాగా జీఎస్టీకి సంగీతం అందించాడు. తన బాలీవుడ్ పేరైన క్రీమ్‌తో ఈ చిత్రానికి పనిచేశాడు. ఇక ఇంతకాలం వివాదాలకు దూరంగా ఉన్న కీరవాణి ప్రస్తుతం తాను కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. గాన గంధర్వుడు కె.జె.ఏసుదాస్‌ని అవమానించాడు. తర్వాత 'బాహుబలి' వేదికపై వేటూరి, సిరివెన్నెల తర్వాత తెలుగు సినిమా సాహ్యితం అంపశయ్యపై ఉందని వ్యాఖ్యానించి నేటి పాటల రచయితల టార్గెట్‌కి గురయ్యాడు. ఇక తాజాగా ఆయన శ్రేయాఘోషల్‌ని కూడా ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించాడు.
ఇక కీరవాణి విషయంలో పోలీసులు ఏమి చేస్తారో చూడాల్సివుంది. వాస్తవానికి ఈ చిత్రం కంటెంట్‌తో, ఇతర విషయాలతో మ్యూజిక్ దర్శకులకు ప్రత్యక్ష ప్రమేయం ఉండదు. కేవలం వర్మనే దీనిని తీశాడా? లేదా? అనే విషయంలో సాక్షిగా మాత్రమే కీరవాణిని పరిగణించే అవకాశాలున్నాయి.