'ఝుమ్మందినాదం' చిత్రంతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం ద్వారా పరిచయమైన హీరోయిన్ తాప్సి పన్ను. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌కి వెళ్లి అక్కడి బిజీ అయిన వేళలో తన తొలి చిత్రంలో దర్శకుడు రాఘవేంద్రరావు తన బొడ్డుపై కొబ్బరిచిప్పలు విసిరాడని, అదేమి శృంగారమో తనకి అర్ధం కాలేదని వ్యాఖ్యానించింది. ఇప్పుడు అదే మాటను గోవా బ్యూటీ ఇలియానా కూడా చెబుతూ, సౌత్ చిత్రాలు అంటే ఇంతే అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఇక పాటలను శృంగారభరితంగా, కలర్‌ఫుల్‌గా తీయడంలో రాఘవేంద్రరావు తర్వాత వైవిఎస్ చౌదరికి అంత పేరుంది. ఆయన నడుం సుందరి ఇలియానాని దేవదాసు చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు సైజ్‌జీరో అందాలు, సన్నని నడుం సుందరిగా ఇలియానాకి ఈ చిత్రం పెద్ద ఫేమ్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆమె తెలుగులోని స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.
తాజాగా ఆమె మాట్లాడుతూ.. సౌత్ ఇండియన్ చిత్రాలలో మహిళలను కేవలం అందాల వస్తువుగా చూపిస్తారని, తనను కూడా అలాగే చూపించారని వ్యాఖ్యానించింది. ఇక ఆ తర్వాత వచ్చిన 'పోకిరి, కేడి, ఖతర్నాక్, మున్నా' చిత్రాల తర్వాత 'ఆట' చిత్రంలో కూడా అలాగే చూపించారని, తనను కేవలం అందాల వస్తువుగా చూపించడం తనకి ఇబ్బందికరంగా, బాధగా అనిపించిందని కామెంట్ చేసింది. అయిందేదో అయింది ఇక ఆపేద్దాం అని నాడు నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇక తనకు పవన్‌కళ్యాన్‌తో చేసిన 'జల్సా', రవితేజతో నటించిన 'కిక్' చిత్రాలు మాత్రమే సంతృప్తినిచ్చాయని వ్యాఖ్యానించింది. ఇక ఎప్పుడో ఆరేళ్ల కిందట పూరీజగన్నాథ్, రవితేజల కాంబినేషన్‌లో వచ్చిన 'దేవుడు చేసిన మనుషులు' తర్వాత ఆమె మరలా తెలుగు చిత్రం చేయలేదు.
ఇక తన మొదటి చిత్రం 'దేవదాసు'లోని తన తొలిషాట్‌లనే తన బొడ్డుపై శంఖం వేశారని, ఇదేమిటి అని అడిగితే. దర్శకుడు వైవిఎస్ చౌదరి ఇలా చేస్తే అందంగా ఉంటుంది. నీకు అందమైన నడుం ఉంది. ఇలా చేస్తే నీకు బాగా పేరొస్తుందని అన్నాడని, ఇప్పటికీ బొడ్డు విషయంలో దక్షిణాది చిత్రాలు ఇలానే వస్తున్నాయని, బాలీవుడ్‌లో మాత్రం తనకి అలాంటి సిట్యూయేషన్స్ ఎదురుకాలేదని ఆమె సౌత్ ఇండస్ట్రీపై వ్యాఖ్యలు చేసింది. మరి దీనిపై మన సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సివుంది...!