'ఆకాశం నీ హద్దురా... అవకాశం వద్దలద్దురా' అనేది పాతకాలంలో వచ్చిన కమల్ చిత్రంలోని పాట. ఇక ఈయన రాజకీయాలలోకి ప్రవేశించాడు. రేపే మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఇంటి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టి మధురై బహిరంగ సభలో ప్రసగించి, తన విధివిధానాలను ప్రకటించనున్నాడు. ఇక కమల్ తాను రాజకీయాలలోకి వస్తున్న తరుణంలో రజనీకాంత్, కరుణానిధి, స్టాలిన్ వంటి వారిని కలిసి శుభాకాంక్షలు అందుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక తాజాగా ఆయన మరో నటుడు, పొలిటీషియన్ అయిన డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ని ఆయన పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న కోయంబేడుకి వెళ్లి కలుసుకుని ముచ్చటించాడు. ఈ సందర్భంగా విజయ్‌కాంత్ మీ లాంటి వారు రాజకీయాలలోకి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు.
పార్టీ ప్రారంభానికి ముందు ఇతరులను కలిసిన విధంగానే రాజకీయంగా తనకు సీనియర్ అయిన విజయ్‌కాంత్‌ని కలిశానని కమల్ ప్రకటించాడు. ఇక ఈయన మదురై బహిరంగ సభలో మొదటిసారి ప్రసంగించనున్నాడు. ఎమ్జీఆర్, జయలలిత, విజయ్‌కాంత్‌లు కూడా మధురై నుంచే తమ రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. హేతువాదిని అని చెప్పుకునే కమల్ ఈ సెంటిమెంట్‌ని ఎందుకు పాటిస్తున్నాడో మరి..!
ఇక ముసలివారు అయ్యేవరకు ప్రజల సమస్యలు గుర్తుకురాని స్టార్స్‌కి ముసలి వయసు వచ్చిన తర్వాత ఇక సినిమాలు చేయలేమని భావించిన తర్వాత రాజకీయాలు గుర్తుకు వచ్చాయా? మూడు దశాబ్దాలు సినిమాలను ఏలాం కాబట్టి రాజకీయంగా కూడా ఏలుతామనే భ్రమలో ఉన్నారా? సినిమాలలో కావాల్సినంత సంపాదించాం కాబట్టి రాజకీయాలలో విఫలమైన ఫర్వాలేదని రజనీ, కమల్ భావిస్తున్నారా? అంటే కట్టప్ప అదేనండీ సత్యరాజ్ ప్రశ్నిస్తున్నాడు. శరత్‌కుమార్, భారతీరాజాల తర్వాత రజనీ, కమల్‌లలో ఈ స్థాయి ఘాటు వ్యాఖ్యలు చేసిన వారిలో సత్యరాజ్ ఒకడనే చెప్పాలి.