నేటి సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలను నెటిజన్లు ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా పలువిధాలుగా కామెంట్స్ చేస్తుంటారు. కొందరు సెలబ్రిటీలు వీటిని తట్టుకోలేక అనసూయలా వాటికి గుడ్‌బై చెబుతుంటారు. మరికొందరు ఇలాంటివి కామనే కదా అని లైట్‌గా తీసుకుంటారు. మరికొందరు సోషల్ మీడియాలోనే అలా కామెంట్స్ చేసి వారికి భారీగా కౌంటర్లు, వార్నింగ్‌లు ఇస్తూ ఉంటారు. మరికొందరైతే అలా కామెంట్స్ చేసే వారిని బ్లాక్ చేస్తారు.
కానీ ఓ టీవీ చానెల్ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. అదే ఎంటీవీ. ఇందులో 'ట్రోల్ పోలీస్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో సెలబ్రిటీల గురించి బాగా కామెంట్స్ చేసే వారిని నేరుగా ఈ కార్యక్రమానికి పిలుస్తారు. వారు ఎవరిని ఉద్దేశించి అయితే అలా కామెంట్స్ చేశారో వారిని కూడా వచ్చి షోలో కూర్చొబెడతారు. తద్వారా తమపై కామెంట్స్ చేసిన నెటిజన్లపై నేరుగా పగ ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని ఆ సెలబ్రిటీలకు ఇస్తారు. మరి నిజంగా చెడామెడా కామెంట్స్ పెట్టే నెటిజన్లు పని గట్టుకుని ఆ షోకి అటెండ్ అయి సెలబ్రిటీల చేత నేరుగా బూతులు ఎందుకు తింటారు?అనే ప్రశ్న మాత్రం అందరిలో ఉదయించకమానదు.
ఇక తాజాగా ఈ కార్యక్రమానికి నటి జరీనాఖాన్‌ని, ఆమెని కామెంట్ చేసిన ఓ నెటిజన్‌ని పిలిపించి ప్రోగ్రామ్స్ జరిపారు. ఆ నెటిజన్‌ని చూసిన వెంటనే జియాఖాన్ ఆపుకోలేక నీ చెంప కంటే నా చేయి పెద్దదిగా ఉంది.. చెంపలు వాయించమంటావా? అని శివంగిలా లేచింది. చివరకు ఆ నెటిజన్ మొహం చూడటం ఇష్టం లేదన్నట్లుగా షో నుంచి నిష్క్రమించింది. ఈ వీడియోను, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇవి చూసిన వారు ఇలాంటి వాటి వల్లనైనా సెలబ్రిటీలు తమను కామెంట్ చేసే వారి మీద పగ తీర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు.