బయోపిక్‌లంటే హాలీవుడ్, బాలీవుడ్‌లలో వచ్చేవే. ఎందుకంటే అందులో వాస్తవాలను తీస్తారు. ఎంతటి వివాదాస్పద అంశాన్నైనా మిస్ చేయకుండా ఎంతో సున్నితంగా చూపిస్తారు. అంతేగానీ తమకి తెలిసిందే చరిత్ర అనే భ్రమ వారిలో ఉండదు. నటీనటుల ఎంపిక నుంచి వారి పాత్రలు, తీరుతెన్నులు, ఇతర విషయాలలో సినిమా ప్రారంభానికి ముందే ఎంతో హోంవర్క్ చేస్తారు. కానీ అవి టాలీవుడ్ వారికి చేత కాదు. తాము ప్రజలందరూ ఏమి అనుకుంటే అదే వారి చరిత్ర అని భావిస్తారు. ఎవరి జీవితంలోనైనా పెద్ద పెద్ద స్థాయి ఉన్నవారి పాత్ర, వారిని చెడుగా చూపించాల్సిన విషయాల నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారు. తమకెందుకు రిస్క్ అనుకుంటారు. బహుశా ఇలాగే 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్ నాగ్ అశ్విన్ భావిస్తున్నాడని అర్ధమవుతోంది. ఈ జీవిత చరిత్రను తాను పరిశోధించిన విధానం చూసి అందరు ఆహా ఓహో అన్నారని, సాయి మాధవ్ బుర్రా మతిపోయి ఎంతో గొప్పగా సంభాషణలు రాస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
కానీ నిజానికి సావిత్రి తర్వాత ఆమె జీవితంలో జరిగిన ఎన్నో విషయాలకు నేటికి జీవించి ఉన్న సాక్షి జమున. ఆమె సావిత్రికి ఎంతో సన్నిహితురాలే కాదు.. ఇద్దరు అక్కాచెల్లెళ్లుగా పిలుచుకుంటూ ఉండేవారు. మరి సావిత్రి బయోపిక్ రూపొందే ముందు ఎవరైనా సరే ఖచ్చితంగా జమున సలహాలు, సూచనలు తీసుకోవాలి. కానీ ఇప్పటివరకు 'మహానటి' యూనిట్‌లోని ఎవ్వరూ జమునను కనీసం కలవలేదట. అంటే ఏదో జనాలలో ప్రచారం ఉన్నట్లు గొప్పగా వెలుగొందిన నటి మోసపోయి ఓ హీరోని పెళ్లి చేసుకుని సర్వస్వం పొగొట్టుకుని దీనస్థితికి చేరుకుంది. చివరి రోజుల్లో వ్యసనాలకు లోనై దీనస్థితిలో గడిపింది అనేది మాత్రమే పాయింట్. కానీ నిజానికి సావిత్రిని మోసం చేసిన వారిలో, సహాయం చేయని వారిలో తెలుగు సినీ పెద్దలు కూడా ఉన్నారు. జెమిని గణేషన్ అందరు అనుకున్నంత దుర్మార్గుడు కూడా కాదు.
ఇలాంటి విషయాలను బయోపిక్‌లో తమ ఇష్టం వచ్చినట్లు చూపిస్తారేమోనని జమున వ్యాఖ్యలతో అనుమానం వస్తోంది. ఇక ఈమె తెలుగు 'మహానటి' పాత్రను తెలుగు భాష తెలియని హీరోయిన్ చేత చేయించడాన్ని కూడా తప్పు పట్టింది. సావిత్రిని జెమినిని చేసుకోవద్దని వారించి, ఆమె చివరి రోజుల్లో ఆమెను అమెరికా తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించాలని నేను భావించాను. కానీ ఈ చిత్రం యూనిట్ ఇప్పటి వరకు నన్ను కలవలేదని బాంబ్ పేల్చింది. సో.. ఈ చిత్రం కూడా ఆత్మస్తుతి.. పరనిందగా సాగుతుందనే అర్ధమవుతోంది.