ఇంకా ఎన్నికల్లో కూడా పోటీ చేసిన అనుభవం కూడా లేని పవన్ కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయంపై మేధావులనందరినీ ఒక తాటి పైకి తెస్తున్నాడు. ఇందులో ఆయన విజయం సాధిస్తారా? లేదా? అన్నది వేరే పాయింట్. అసలు ఇంత వరకు ఏపీలోని మేధావులను, పార్టీలను ఏకం చేసి పోరాటం చేసే దిశగా ఇప్పటి వరకు జగన్ ఏమైనా చేశాడా? ప్రతిది రాజకీయ కోణంలో మాట్లాడటం కూడా సరికాదు. ఇక తాజాగా జగన్ పవన్‌పై ప్రకాశం జిల్లా కందుకూరు సభలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నేను చంద్రబాబు పార్ట్‌నర్ అయిన పవన్‌ని అడుగుతున్నాను. దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టమని పవన్ అంటున్నాడు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి మా ఎంపీల బలం సరిపోదు. మరి మేం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రెడీగా ఉన్నాం. టిడిపి ఎంపీలను కూడా మాకు మద్దతు ఇచ్చేలా మీరు ఒప్పించగలరా? అని ప్రశ్నించాడు.
పవన్ ఇప్పటివరకు తాను ఒంటరిగా పోటీ చేస్తాడా? ప్రత్యేకహోదా ఇస్తామంటే కాంగ్రెస్‌కి మద్దతు పలుకుతాడా? లేక టిడిపితో పొత్తు పెట్టుకుంటాడా? లేక వైసీపీ నచ్చితే దానికి సపోర్ట్ చేస్తాడా? అనేది ఆయన చెప్పలేదు. ఆయన చెప్పకుండానే చంద్రబాబు పార్ట్‌నర్‌గా పవన్‌ని అభివర్ణించడం సరికాదు. నేను అధికారంలోకి వస్తే అన్ని చేస్తానని జగన్ అంటున్నాడు. మరి ఇంత వరకు ఆయన ప్రతిపక్ష నాయకునిగా సాధించిన ఘనత, చేసిన సేవ ఏమిటి? జగన్ వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే, బిజెపికి గానీ, కాంగ్రెస్‌కి గానీ సపోర్ట్ ఇవ్వడని ఏమైనా గ్యారంటీ ఉందా? ఎన్నికల్లో పొత్తు లేకపోయినా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే వీలుంటే దానికే జగన్ మద్దతు ఇస్తాడనేది ప్రజల నిశ్చితాభిప్రాయం. ఇంతకాలం టీఆర్‌ఎస్‌ని ఒక్క మాట అనని జగన్, ఇప్పుడు బిజెపిని విమర్శిస్తుంటే బీజెపి నేతలు మౌనంగా ఉండటానికి కారణం ఏమిటి? ఇక పవన్ మద్దతు ఇచ్చిన విజయవాడలోని రౌండ్‌టేబుల్ సమావేశంలో నాయకులు ఎక్కువగా చంద్రబాబునే టార్గెట్ చేసింది నిజం కాదా..!
పవన్ చంద్రబాబు తొత్తు అని కూడా అనలేం. ఆయన తన స్టాండ్‌ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. లేకపోతే చంద్రబాబు అంటే మండిపడే ఉండవల్లిని పవన్ కలుపుకోడు అనేది స్పష్టం. ఇక తాజాగా కందుకూరు సభలో కూడా జగన్ ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పని లేదని మరోసారి చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. వెయ్యి రూపాయల పెన్షన్‌నే చంద్రబాబు ఎలా ఇవ్వగలడు? అని ప్రశ్నించి జగన్ నేడు తాను అధికారంలోకి వస్తే వృద్దాప్య పించన్లను 10వేలు చేస్తానని, రెండు వేలు చేస్తానని, తన నోటికి వచ్చిన అంకె చెబుతున్నాడు. ఇక వృద్దాప్య పెంక్షన్లను 45 ఏళ్ల నుంచే ఇస్తానంటున్నాడు. ఆలెక్కన జగన్ కూడా వృద్దాప్య పెంక్షన్‌కి అర్హుడైపోతాడన్నమాట...!