బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లు తమ బిజినెస్ పరిధిని బాగా పెంచుకుంటున్నాయి. దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ వంటి చిత్రాలు ఇండియాలోనే కాదు చైనాలో కూడా అద్భుతమైన కలెక్షన్లు సాధించాయి. తెలుగులో బాహుబలి తెలుగు సినిమా పరిధిని పెంచగా, కోలీవుడ్‌లో వస్తున్న '2.0' కూడా ప్రపంచంలో తన హవా చాటేలా కనిపిస్తోంది. అయినా కూడా హాలీవుడ్ మాత్రం సరికొత్త ప్రయోగాలు, విన్యాసాలతో అన్ని భాషా చిత్రాలకు సరికొత్త టార్గెట్స్‌ని నిర్దేశిస్తోంది. తమ స్థాయిని మరింతగా పెంచి ప్రతి దేశంలోనూ, ముఖ్యమైన అన్ని భాషలలోకి డబ్ అవుతూ, హాలీవుడ్ థ్రిల్‌ని మన సగటు ప్రేక్షకునికి కూడా అర్ధమయ్యే రీతిలో ప్రమోట్ చేస్తూ ముందుకెళ్తోంది.
ఇక వారం రోజులుగా ప్రపంచం అంతా 'బ్లాక్‌పాంథర్' మేనియాలో మునిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా వర్ణ వివక్ష లేదని చెబుతున్నా కూడా హాలీవుడ్ చిత్రాలలో అందరు నల్లజాతి నటీనటులు నటించినా, లేదా సినిమా మొత్తం లేడీస్ ఉన్నా కూడా అవి పెద్దగా బాక్సాఫీస్ వద్ద సరితూగవనే నమ్మకం ఇంతకాలం ఉంది. ఈ సెంటిమెంట్‌ని 'బ్లాక్‌పాంధర్' చిత్రం బ్రేక్ చేసి, చరిత్రను తిరగరాస్తోంది. ఇందులో లీడ్ రోల్ చేసిన 'చాద్విక్ జోస్మన్'తో సహా దర్శకుడు ర్యాన్ కూగ్లర్ కూడా నల్లజాతీయుడే. మార్వెల్ సినిమాటిక్ యూనివర్శ్ బేనర్‌లో 18వ చిత్రంగా ఇది రూపొందింది. హాలీవుడ్‌లో ఇది ఒక రివల్యూషన్ ఫిల్మ్. సూపర్‌హీరో జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వీకెండ్‌లో1300కోట్లు వసూలు చేయడం విశేషం.