గతంలో శంకర్ తీసిన సినిమాలన్నీ అనుకున్న తేదీకి వచ్చిన పాపాన పోలేదు. విక్రమ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఐ' సినిమాని శంకర్ చెక్కి చెక్కి చాన్నాళ్లు చెక్కి రెండున్నరేళ్ళకి విడుదల చేశాడు. అలా శంకర్ చేసే సినిమాలకు అన్ని భారీ గ్రాఫిక్ వర్క్ తో కూడుకున్నవి కావడంతోనే అనుకున్న తేదికి సినిమాని విడుదల చెయ్యలేక శంకర్ తో పనిచేసే నిర్మాతలంతా చేతులెత్తేస్తారు. అయినా శంకర్ తో సినిమా అంటే ప్రతి ఒక్క హీరో, నిర్మాత ఇంట్రెస్ట్ చూపుతారు. ఇక ఇప్పుడు గత రెండున్నరేళ్లుగా రజినీకాంత్ హీరోగా శంకర్ లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో '2.0' సినిమాని తెరకెక్కిస్తూనే ఉన్నాడు. ఈ సినిమాని కూడా శంకర్ చెక్కి చెక్కి ఎలాగో రెండేళ్ళకి షూటింగ్ పూర్తి చేశాడు. అలాగే '2.0' ని జనవరి 26 న విడుదల చేస్తామని డేట్ అనౌన్స్ చేశారు.
అలాగే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలెట్టేశాడు. అయితే అంతలోనే సినిమా జనవరి నుండి ఏప్రిల్ కి వెళ్లనుందని మరోసారి లైకా వారు ప్రకటించారు. ఇక ఆ డేట్ కి '2.0' వస్తే మా సంగతేంటంటూ తెలుగు నిర్మాతలు అంతెత్తున లేచారు. మళ్ళీ అంతలోనే '2.0' ఏప్రిల్ నుండి వాయిదా పడిందనే న్యూస్ రావడం వెంటనే రజినీకాంత్ 'కాలా' సినిమాని ఏప్రిల్ 27కి ప్రి పోన్ చెయ్యడం జరిగాయి. మరి ఇప్పుడు కూడా '2.0' సినిమా గ్రాఫిక్స్ విషయంలోనే సమస్య రావడం వలనే సినిమా విడుదల వాయిదా పడిందంటున్నారు.
మరి ఇలా ఒక భారీ బడ్జెట్ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడితే జనాల్లో సినిమాపై ఉన్న ఇంప్రెషన్ తగ్గిపోతుంది కదా.. ఏదో రజినీకాంత్ మీదున్న అభిమానంతో సినిమాకి భారీ ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉన్న సినిమాకు ఇంతకు మునుపున్న క్రేజ్ మాత్రం తగ్గిపోతుంది. మరి'2.0' గ్రాఫిక్స్ ని అమెరికాలోని ఒక బడా కంపెనీకి అప్పజెప్పగా... సగం పనులు పూర్తయ్యాక ఆ సంస్థ దివాళా తీసే ఆలోచనలో ఉండడంతో.. మళ్ళీ '2.0' గ్రాఫిక్స్ పనులను మొదటినుండి వేరే సంస్థకు మంచి క్వాలిటీ కోసం అప్పజెప్పడం... ఇలా ఎప్పటికపుడు వార్తలు రావడంతో సినిమా మీద హైప్ తగ్గిపోతుంది గాని క్రేజ్ మాత్రం పెరగదు అంటున్నారు. చూద్దాం '2.0' ఈ ఏడాది కూడా విడుదలయ్యే పరిస్థితులు లేవంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.