మెగా కాంపౌండ్ నుంచి ఎందరు వచ్చినా కూడా వారందరి కెరీర్ మెగాస్టార్ చిరంజీవి పుణ్యమేనని చెప్పాలి. ఆయన మహావృక్షం అయితే వీరందరూ దాని నీడని, పళ్లని తింటూ ముందుకెళ్తున్నారు. ఇక వారికంటూ వారికి సొంత ఇమేజ్ వచ్చినా కూడా అల్లుఅర్జున్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఆయన వేసిన బాటలో, రహదారిలో, ముళ్ల కంచెలను తొలగించి ఆయన పడ్డ కష్టాన్ని సొమ్ము చేసుకున్న వారే. ఇక వీరిలో సాయిధరమ్‌తేజ్‌ని గురించి ముఖ్యంగా చెప్పాలి. ఈయనను హీరోగా నిలబెట్టాలని తానే పెట్టుబడి పెట్టి, వైవిఎస్‌చౌదరి చేతిలో తన మేనల్లుడిని పెట్టి, 'రేయ్' చిత్రం చేసిన ఘనత పవన్‌దే. అయితే సాయి విషయంలో చిరంజీవి పాత్ర కూడా ఎంతో ముఖ్యమైంది.
ముఖ్యంగా ఆయన మెగాస్టార్ విషయంలో తెలిసి చేశాడో, తెలియక చేశాడో గానీ చిరంజీవి 150 వ చిత్రం 'ఖైదీనెంబర్ 150' సంక్రాంతి పోటీలో ఉందని తెలిసి, దిల్‌రాజు బేనర్‌లో సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో వచ్చిన 'శతమానం భవతి' చిత్రం కూడా అదే సమయంలో రిలీజ్ చేయాలని దిల్‌రాజు భావించడంతో ఈ సినిమాని వదిలేసి, శర్వానంద్‌కి ఫోన్ చేసి ఆ చిత్రం చేయమని సలహా ఇచ్చాడు. అదే ఆ చిత్రంలో నటించి ఉంటే సాయి పరిస్థితి నేడు వేరుగా ఉండేది. ఆ చిత్రం ప్లేస్‌లో తిక్క, నక్షత్రం వంటి చిత్రాలను చేసి చేతులు కాల్చుకున్నాడు. అయినా చిరంజీవి చిత్రానికి తన చిత్రం పోటీ ఎలా అవుతుంది? అనేది అర్ధం కాని విషయం. మరి అదే తేజు ఇటీవల 'తొలిప్రేమ'తో వరుణ్‌తో పోటీ పడ్డాడు కదా...!
ఇక అసలు విషయానికి వస్తే సాయిధరమ్‌తేజ్ 'రేయ్'తో పరిచయం అయినా కూడా ఆయన తొలి పారితోషికం అందుకుంది మాత్రం 'పిల్లా నువ్వులేని జీవితం'తోనే. ఈ సినిమాకి వచ్చిన రెమ్యూనరేషన్ చెక్‌ని తేజూ తన పెదమామయ్య చిరంజీవి పుట్టినరోజు నాడు ఆయనకు గురుదక్షిణగా సమర్పించాడట. ఇదే విషయాన్ని తేజూ చెబూతూ, నేను ఈ స్థితిలో ఉన్నానంటే చిరంజీవి మావయ్యే కారణం. దాంతో ఆయన బర్త్‌డే రోజు నా తొలి రెమ్యూనరేషన్‌కి ఆయనకు గిఫ్ట్‌గా ఇస్తే ఆయన ఎంతో ఆశ్చర్యపోయారు అని చెప్పుకొచ్చాడు.