ఆమధ్య మెగాహీరోలను ఉద్దేశించి వరుస ట్వీట్స్ చేస్తూ వివాదాస్పదంగా మారిన వర్మ ఆ తర్వాత నా చావు నేను చస్తా.... ఇక మెగాహీరోలు, అభిమానుల జోలికి పోనని తెలిపాడు. ఇక తన మాట మీద తనకు నిలకడ ఉండదని, తాను ఇకపై మాట మీద నిలబడనని ప్రామిస్ చేశాడు. 'అజ్ఞాతవాసి' తర్వాత కొన్ని సెన్సేషనల్ ట్వీట్స్ చేసిన వర్మ తాజాగా మరోసారి చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లను ఉద్దేశించి ట్వీట్లతో చెలరేగిపోయాడు. పవన్ నోవాటెల్‌లో 'జనసేన' పార్టీని స్థాపించినప్పుడు సింహంలా కనిపించాడని, కానీ ఆయన రాను రాను 'ఫలానా వారికి అది చేయండి.. ఫలానా వారికి ఇది చేయండి' అని అడుక్కుంటున్నాడని ఎద్దేవా చేశాడు. ఈ విషయంలో వర్మ అభిప్రాయంతోనే పలువురు ఏకీభవిస్తున్నారు. పోరాడి సాధించాల్సిన విషయాలను కూడా ఫలానా సమస్యలను తీర్చండి అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మోదీలను ఆయన అడుగుతున్న తీరు ఆయన మనస్తత్వానికి, ఆయన్ను ఇష్టపడే వారికి మింగుడు పడని విషయమే.
అంటే అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే బదులు మృదువుగా కోరికలు, ఏవో తన సొంత కోరికలు కోరినట్లుగా విజ్ఞాపనలు, వినతులు చేయడం సరికాదు. శ్రీశ్రీ అన్నట్లు పోరాడితే పోయేదేముంది... బానిస సంకెళ్లు తప్ప అనేది ముఖ్యం. ప్రజలందరు రాజకీయాలకు అతీతంగా ఏపీకి పవన్ చేయాలని చూస్తున్న మంచి విషయంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన ఎవ్వరినీ బతిమాలకుండా నిలదీయాలని, ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అందునా ఆయనకు ఇప్పుడు ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ్ వంటి వారి తోడ్పాటు కూడా ఉంది. తన చరిష్మా, క్రేజ్‌కి వారి అనుభవాన్ని ఉపయోగిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. మేధావులను ఒకతాటిపైకి తేవడంతోనే సమస్య పరిష్కారం కాదు. అయినా అది కూడా మొదటి విజయమేనని చెప్పాలి.
ఇక పవన్‌ని వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేయాలని లేకపోతే ప్రజలు ప్రజారాజ్యం పార్టీకి పట్టించిన గతే జనసేనకి కూడా వర్తిస్తుందని వర్మ అంటున్నాడు. అయితే అందరు ఎన్టీఆర్‌లా కేవలం 8నెలల్లో అధికారం చేజిక్కించుకోలేరు. నాడు ఉన్న పరిస్థితులు ఎన్టీఆర్‌కి దోహదం చేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. నేడు ఎన్టీఆర్ అయినా గెలవాలంటే ఎన్నో తిప్పలు పడాల్సిందే. మరి అన్నప్రాసన రోజే ఆవకాయ తినమంటే పవన్ మాత్రం ఎలా తినగలడు? అన్నదే పాయింట్.