మేల్‌డామినేటెట్ ఇండస్ట్రీలో మూడు తరాల వారసుల చిత్రాలలో నటిస్తూ, తన సుదీర్ఘమైన 50ఏళ్ల నట ప్రస్థానాన్ని శ్రీదేవి ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇక ఈమె నిలువెత్తు విగ్రహాన్ని బ్యాంకాక్‌లోని ఓ రెస్టారెంట్‌లో పెట్టడం, ఇక రాంగోపాల్ వర్మ బాలీవుడ్‌లో ఆమె నటించిన ఓ చిత్రంలోని పాటను తదేకంగా, పక్కనే ఓడ్కా గ్లాస్‌తో కనిపిస్తూ శ్రీదేవి భక్తునిగా మారాడు. మరోవైపు త్వరలో శ్రీదేవి పేరిట మీద దేశంలోని పలు ప్రాంతాలలో నటన శిక్షణ కళాశాలను స్థాపించి, వాటిలో శ్రీదేవి నటన మీదనే క్లాస్‌లు, ఆమె ఎలా నటించింది? ఎలా డ్యాన్స్ చేసింది? వంటి విషయాలన్నీ శ్రీదేవినే ఉదాహరణగా తీసుకుని తర్ఫీదు ఇవ్వడానికి ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సన్నాహాలు మొదలుపెట్టి శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్‌ల పర్మిషన్ కూడా తీసుకున్నాడు. మొదటగా ఈ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని శ్రీదేవి పేరుతో స్థాపించడమే కాదు.. ఆమె చేతనే ప్రారంభోత్సవం చేయించాలని సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు ఏకంగా శ్రీదేవి జీవిత చరిత్ర మీద ఓ డాక్యుమెంటరీనే రూపొందనుంది. బెంగుళూరుకి చెందిన ఫ్యాన్స్ వ్యవస్థాపకులు ఆమె భర్త బోనీ కపూర్‌తో కూడా పలు దఫాలు చర్చలు కూడా జరిపారట. బోనీకపూర్‌తో పాటు శ్రీదేవి కూడా ఆనందంగా ఒప్పుకోవడంతో ఇప్పుడు శ్రీదేవి బయోపిక్‌ని ఐదు భాగాలుగా ఓ సిరిస్‌లా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో శ్రీదేవి జననం, ఆమె బాలనటిగా పరిచయం, తర్వాత దక్షిణాది అన్ని భాషల్లో ఆమె సాధించుకున్న పేరు ప్రఖ్యాతులు, కీర్తిప్రతిష్టల నుంచి ఇప్పటివరకు ఆమె జీవితాన్ని కూలంకశంగా తెరకెక్కించనున్నారట.
అంతేకాదు ఇందులో శ్రీదేవితో కలిసి నటించిన వారి అభిప్రాయాలు, కుటుంబ సభ్యుల పరిచయం, వారి అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూడు భాగాలుగా రూపొందే ఈ డాక్యుమెంటరీలో శ్రీదేవి నటించిన చిత్రాల క్లిప్పింగ్‌లను, పలు సీన్స్, పాటలు, డ్యాన్స్‌లు, ఇతర హావభావాలు అద్భుతంగా ఉండే పలు సన్నివేశాలను కూడా జోడించి తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట. ఒక్కో సిరీస్ గంట పాటు సాగుతుందని తెలుస్తోంది.