పవన్‌కళ్యాణ్ ఇప్పుడిప్పుడు ప్రణాళికా బద్దంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. కేంద్రం ఏపీకి ఇచ్చామని చెబుతున్న నిధుల వివరాలు, టిడిపి చెబుతోన్న నిధుల వివరాలు తమకి ఇవ్వాలని, దీనిపై జెఎఫ్‌సి అధ్యయనం చేస్తుందని తెలిపాడు. దీనికోసం లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ్, ఉండవల్లి అరుణ్ కుమార్‌లు దీనిని అధ్యయనం చేస్తారని తెలిపాడు. కానీ ఆయన ఇటు కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా ఏమీ విమర్శించవద్దని, ఆయన రాష్ట్రం మంచి కోసమే ఇది చేస్తున్నారు. మనం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆయన విషయంలో నాయకులు సున్నితంగా వ్యవహరించాలని చంద్రబాబు తన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశాడు.
పవన్ విషయంలో సున్నితంగా వ్యవహరిస్తే అవసరమైనప్పుడు ఆయన కూడా టిడిపి పట్ల సానుకూలంగా స్పందిస్తాడని, జెఎఫ్‌సి వల్ల మనకేం నష్టం లేదని బాబు తన సహచరులకు సూచించారని సమాచారం. పవన్ శ్వేతపత్రం అడిగినా సున్నితంగానే సమాధానం చెప్పాలని, నిధులు ఇచ్చిన వారు శ్వేతపత్రం ఇవ్వాలే గానీ ఖర్చు చేసిన వారు శ్వేతపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తమ అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు. అయినా కేంద్రం ఎంత నిధులిచ్చింది? వాటిని ఆయా పనులకే ఉపయోగించారా? లేక దుర్వినియోగం చేశారా? అనేది కూడా తెలియాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం ఉందనే ప్రజలు భావిస్తున్నారు. అసలు దేశంలో సమాచార హక్కు చట్టం ఉన్నప్పుడు పది రూపాయలతో ఒక్క దేశ రక్షణ విషయాలు తప్ప అన్ని వివరాలు మన చేతికి వచ్చే సౌకర్యం ఉన్నప్పుడు ఇక వీటిపై శ్వేతపత్రాల అవసరం ఏమిటి? అని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు.
మరోవైపు లోక్‌సత్తా జెపి వద్ద ఆల్‌రెడీ పవన్ కేంద్రాన్ని, రాష్ట్రాన్ని అడిగిన అన్ని వివరాలు ఉన్నాయనే ఉండవల్లి కూడా చెబుతున్నాడు. తాజాగా పవన్‌ని స్వరాజ్ అభియాన్ నేత, ఆమ్ ఆద్మీపార్టీ మాజీ కార్యనిర్వాహక సభ్యుడు యోగేంద్ర యాదవ్‌తో పాటు చల్లసాని శ్రీనివాస్ కూడా కలిశారు. జెఎఫ్‌సికి సంబంధించిన చర్చల్లో తాము కూడా పాల్గొంటామని చెప్పిన చల్లసాని శ్రీనివాస్ జెఎఫ్‌సికి తమ సంఘీబావం తెలిపాడు. మరోవైపు పవన్ రెండుసార్లు ఫోన్ చేసినా కూడా ఎత్తని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్ది తాజాగా పవన్ ఫోన్ కాల్‌కి స్పందించినప్పటికీ తాను ఈ సమావేశానికి రాలేనని, తమ ప్రతినిదులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌లు హాజరవుతామని చెప్పారు. మరోవైపు వామపక్ష నేతలు కూడా పవన్‌కి మద్దతు ప్రకటించారు. దీంతో వైసీపీ, బిజెపి, టిడిపిలను తప్ప అందరినీ పవన్ ఒక తాటిపైకి తెచ్చాడు. టిడిపి అధికారంలో ఉంది.. ఆ పార్టీ కూడా శ్వేతపత్రం ఇవ్వాల్సి ఉంది కాబట్టి టిడిపి తరపున ఎవ్వరీనీ పిలిచే అవకాశం లేదు.
ఇక తెలంగాణ బిజెపి నేత అయిన సుధీర్‌రాంబొట్ల తాజాగా పవన్‌పై విరుచుకుపడ్డాడు. కావాలంటే వెబ్‌సైట్‌లో వివరాలు ఉంటాయి. చూసుకోవచ్చని చెప్పిన ఆయన సమాచార హక్కు చట్టం ప్రకారం తెప్పించుకోవాలే గానీ ఆయన ప్రెస్‌మీట్ పెడితే మేమెందుకు వివరాలు ఇవ్వాలి? అని ప్రశ్నిస్తున్నాడు. అయినా తెలంగాణకు చెందిన నేతకు ఆంధ్రా విషయంలో ఏమీ పని అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తాజాగా కిషన్‌రెడ్డి కూడా పవన్ జోకర్ అని, ఆయనకు నటనే రాదు.. రాజకీయాలేం తెలుసని, ఆయన కంటే ఆయన అన్నయ్య కుమారుడే బాగా నటిస్తాడని అసహనం వ్యక్తం చేస్తుండటం చూస్తుంటే పవన్ భయం వైసీపీ నుంచి బిజెపి వరకు అందరికీ మొదలైందని అందుకే ఇలా అసహనంగా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది. పవన్ ఇంకా పోరు బాట పట్టలేదు. పోరుబాట పడితే ఆయనకున్న క్రేజ్‌కి మిగిలిన రాజకీయ పక్షాలు అన్ని డైలమాలో పడిపోక తప్పదనే చెప్పాలి. మరి ఈ అవకాశాలను పవన్ ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.