సినిమా బాగుండి రివ్యూలు బాగా వస్తే మీడియా గొప్పది అని, అదే రివ్యూలు బాగా ఇవ్వకపోతే మీడియా అమ్ముడుపోయిందని, ప్రలోభాలకు లొంగారని, వేరే హీరోల తొత్తులుగా వ్యవహరించారని,. ఇలా తన 'గాయత్రి' చిత్రంకి సరైన రివ్యూలు రాకపోవడంతో మోహన్‌బాబు మీడియాపై ఎగిరెగిరిపడ్డాడు. ఇక తాజాగా ఆయన పైరసీపై నోరు విప్పాడు. పైరసీ అనేది హాలీవుడ్, బాలీవుడ్ నుంచి కోలీవుడ్, టాలీవుడ్ వరకు అన్ని చోట్లా ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలి? అనేది ఆలోచించాలి. తాజాగా కోనవెంకట్ కొత్త సినిమాల పైరసీని నెట్‌లో పెట్టిన వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్స్‌ని తీసి మరీ తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి పైరసీని తీసుకెళ్లాడు. ఇక కోలీవుడ్‌లో అయితే తమిళ రాకర్స్ దెబ్బకి పైరసీ చేయండి కానీ రెండు మూడు రోజుల తర్వాత చేసుకోండి అని దర్శకనిర్మాతలు బతిమాలుతున్నారంటే పరిస్థితి అర్ధమవుతోంది. ఇక ఇండస్ట్రీలో మోహన్‌బాబు ఎంతో సీనియర్. నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఇండస్ట్రీ సమస్యలను దాసరి, ఎన్టీఆర్‌ల పక్కన ఉండి మరీ పరిశీలించారు.
ఇక ఈయన మా అసోసియేషన్‌కి అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. మరి ఆయన ఆ పదవిలో ఉన్న కాలంలో పైరసీ నియంత్రణకు ఏం కృషి చేశాడో చెప్పగలరా? ఇప్పుడు కేవలం తన సినిమా పైరసీ అయ్యే సరికి గొంతు చించుకుంటున్నాడు. మరి ఇతర చిత్రాలు, చిన్న చిత్రాల వారు పైరసీ మూలంగా రోడ్లు ఎక్కినప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఆయన ఏయే చర్యలు తీసుకున్నాడు. నేటిలాగా నాడు ఆన్‌లైన్ పైరసీ లేకపోయినా సీడీలు, డివిడీల రూపంలో నాడు కూడా పైరసీ బూతం ఉండేది. ఇక తాజాగా ఆయన మాట్లాడుతూ, సినిమాలు పైరసీ చేసే వారు నీచులు, వాటిని చూసే వారు నీచాతి నికృష్టులు. పైరసీ చేసే వారికి కూడా కుటుంబాలు ఉంటాయి. వారు నాశనం అవుతారు. 'గాయత్రి' చిత్రం విషయంలో నా మససు ఏడుస్తోంది ఏడెనిమిది నెలల కష్టం బూడిదలో పోసినట్లు అయింది. ఈ వయసులో కూడా లెక్క చేయకుండా రిస్కీ ఫైట్స్ చేశాను అని తిట్టాడు.
అయితే పైరసీపై తమ చిత్రాలు విడుదలైనప్పుడే స్పందించడం కాకుండా మిగిలిన సమయాలలో కూడా స్పందిస్తేనే దానికి విలువ, సినీ పెద్దగా గౌరవం ఉంటాయి. ఇక డిజె విషయంలో పైరసీ వల్ల నష్టపోతున్నామని చెప్పిన దిల్‌రాజు 'ఫిదా', తాజాగా 'తొలిప్రేమ'లు బాగా ఆడుతుండే సరికి ఆయన పైరసీ గురించి మర్చిపోయాడు. మరి 'తొలిప్రేమ'కి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నప్పుడు 'గాయత్రి, ఇంటెలిజెంట్'లకు మాత్రమే వసూళ్లు రావడం లేదు ఎందుకని? అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. సినిమాలో సత్తా లేనప్పుడే ఇలాంటివి బయటకి వస్తాయి. సినిమా బాగుంటే పైరసీని కూడా కాదని ప్రేక్షకులు మంచి సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉన్న మాట మాత్రం వాస్తవం.