నాడు చంద్రబాబుతో పాటు నాయకులందరూ హైదరాబాద్‌లోనే అన్నింటిని ఏర్పాటు చేసి, అభివృధ్ది నుంచి హైటెక్ సిటీ వరకు హైదరాబాద్‌కే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అధికార కేంద్రీకరణ, అభివృద్ది కేంద్రీకరణ కేవలం హైదరాబాద్‌లోనే జరిగింది. అది రాష్ట్ర విభజన సమయంలో ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది. అయినా చంద్రబాబు సర్కార్ ధోరణిలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. కేవలం తమ సామాజిక వర్గం పెత్తనం అధికంగా ఉండే అమరావతిని రాజధానిని చేయడంతో కర్నూల్ నుంచి పలువురు రాయలసీమ వాసులు ఇప్పుడు కూడా అన్ని అమరావతి చుట్టూనే జరుగుతున్నాయని, తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.
మరోవైపు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల మద్య కూడా చిచ్చురేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖ వాసుల సెంటిమెంట్, ఎప్పటి నుంచో ఉన్న కోరిక ప్రత్యేక రైల్వే జోన్. కానీ ఈ విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌కి ఉన్న ఆటంకం ఒరిస్సానే. బిజెపి పట్టు ఉన్న రాష్ట్రాలలో ఇది కూడా ఒకటి. అక్కడ పాగా వేయాలంటే ఆ ప్రాంతాన్ని దూరం చేసుకోకూడదు. విశాఖకి రైల్వేజోన్ ప్రకటిస్తే భువనేశ్వర్ జోన్‌కి ఆర్ధికంగా నష్టం వాటిల్లుతుందని ఒరిస్సా ఆందోళన, ఇక బిజెపి ప్రభుత్వం కేవలం తమకు పట్టు ఉన్న, పట్టు వచ్చే ప్రాంతాలపై పెట్టిన దృష్టి మిగిలిన ప్రాంతాలపై పెట్టడం లేదు. దీంతో దీనిని సాకుగా తీసుకుని దక్షిణ కోస్తాకి చెందిన పలువురు బలమైన నాయకులు వైజాగ్‌కి ఒరిస్సా అడ్డు ఉంటుంది కాబట్టి ప్రత్యేక రైల్వే జోన్‌ని ఆంధ్ర ఏరియాలను కలుపుతూ విజయవాడకి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.
దీనికి కేంద్రం కూడా సానుకూలంగానే ఉందిట. ఇక విభజించి పాలించే బిజెపి ఏపీలోని ప్రాంతాల మద్యనే చిచ్చుపెట్టి 'తాంబూళాలు ఇచ్చాం.. తన్నుకు చావండి' అనే విధంగా ఆలోచిస్తోంది. విజయవాడకి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తే అది విశాఖ వాసులకు తీవ్ర వేదనకు గురి చేయడం ఖాయం. ఇక వైజాగ్ ఎంపీ, ఏపీ బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా ఈ విషయంలో మౌనంగానే ఉంటున్నాడు. అదే జరిగితే పవన్ చెప్పినట్లు రైల్వే జోన్, డ్రెడ్డింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణల వల్ల బిజెపి ఓటమి వైజాగ్‌తోనే ప్రారంభం కానుందనే విషయం నిజమయ్యే అవకాశం ఉంది....!