మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ శ్రీమతి గొప్పంటి బిడ్డ అయినా ఆ తర్వాత మెగా ఇంటికి కోడలైంది. ఈమె తన వ్యాపార విషయాలలో బిజీగా ఉంటే రామ్‌చరణ్ మరోవైపు హీరోగా, నిర్మాతగా బిజీగా ఉన్నాడు. ఇలా ఎవరి బిజీలో వారు ఉన్నా కూడా వారిద్దరు తమ ప్రేమను, జీవితంలోని మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మెగాభిమానులకు సంతోషం పంచుతుంటారు. ఈ విషయంలో రామ్‌చరణ్ కంటే ఆయన శ్రీమతి ఉపాసనే ఓ అడుగు ముందుంటుంది.
తాజాగా 'రంగస్థలం 1985' షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్‌చరణ్, తన శ్రీమతితో కలిసి ఆస్ట్రియా దేశానికి వెళ్లి వాలంటైన్స్ డేని అద్భుతంగా జరుపుకున్నారు. వీరు ఆస్ట్రియా దేశానికి వెళ్లడానికి కూడా ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. వాలంటైన్స్ డే నాడు ప్రేమికులు తమ లవర్స్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు, అనుకోని సర్‌ప్రైజ్‌లు ఇస్తారు. ఎవరు ఎలా ప్రేమను తెలుపుకున్నా కూడా అవి వారి జీవితాలలో మధురక్షణాలుగా నిలిచేందుకే అని చెప్పాలి. ఇక రామ్‌చరణ్ -ఉపాసనలు ఆస్ట్రియా వెళ్లి వాళ్ల దేశ ఆచారాల ప్రకారం తమ వాలంటైన్స్ డేని జరుపుకున్నారు. ఆ దేశం ప్రత్యేకత ఏమిటంటే...రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తమ ప్రేమను లాక్ చేసుకోవడం అన్నమాట. లాక్ అంటే ఏమిటంటే అది ఆస్ట్రియో ప్రేమికులలో ఉన్న ఓ నమ్మకం. అక్కడ సాల్జ్‌బర్గ్ లవ్‌లాక్ బ్రిడ్జి ప్రత్యేకమైంది.
ఆ బ్రిడ్జ్ వద్ద ఇద్దరు ప్రేమికుల పేర్లను ఓ లాక్ అంటే తాళం కప్పపై రాసి ఆ లాక్‌ని బ్రిడ్జికి సైడ్‌గా ఉన్న ఫెన్స్‌కి లాక్ చేసి, ఆ కీ అంటే తాళాం చెవిని ఆ నదిలో పడేస్తారు. అలా చేస్తే వారి ప్రేమ జన్మజన్మలకి విడదీయరాని బంధంగా మారుతుందని అక్కడి ప్రేమికుల నమ్మకం. ఉపాసన కూడా 'ఉప్సి-రామ్' అని తాళం కప్పపై రాసి వాలంటైన్స్ డేని జరుపుకున్నారు. ఇలా ఉప్సీ-రామ్ అని ఉన్న తాళం కప్ప ఫొటోని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారు ఆ తాళం చెవిని ఆ నదిలో కూడా వేసి తమది ఇక జన్మజన్మల బంధమని మురిసిపోయిన ఈ స్టిల్ మెగాభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.