పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరియు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చుక్కలు చూపడమే తన కర్తవ్యం అంటూ బయలు దేరిన పవన్ కళ్యాణ్ అసలు మళ్ళీ సినిమాలు చేస్తాడా? అనేది పెద్ద క్వచ్చన్ మార్క్. ఒకరు పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటే... ఇటు సినిమాలని చేస్తాడని అంటుంటే... మరికొందరు పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి రాజకీయాల మీదే కూర్చుంటాడంటున్నారు. కానీ పవన్ కాసేపు సినిమాలు ఆపేస్తా అంటాడు.. కాసేపు సినిమాలు చెయ్యకపోతే డబ్బెక్కడిది అంటాడు. మరి రాజకీయాలు, సినిమాల మీద పవన్ కే క్లారిటీ లేనప్పుడు ఎవరెన్ని చెబితే ఏంటి.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండు నిర్మాణ సంస్థల నుండి సినిమాలు చెయ్యడానికి భారీగా అడ్వాన్స్ లు తీసుకున్నాడు. ఒకటి మైత్రీ మూవీ మేకర్స్ నుండి తీసుకుంటే... మరొకటి ఏ ఎమ్ రత్నం నుండి అడ్వాన్స్ తీసుకుని వారికీ సినిమాలు చెయ్యకుండా చుక్కలు చూపిస్తున్నాడు. మొన్నటికి మొన్న మైత్రీ వారు పవన్ విషయంలో కోర్టుకి కూడా వెళుతున్నారని ప్రచారం జరిగింది. అయితే పవన్ మాత్రం 2019 ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా .. అందుకే ఈ లోపు ఒక సినిమా చెయ్యొచ్చనే ఆలోచనలో ఉన్నాడట. మరి ఏ నిర్మాణ సంస్థలో సినిమా చేస్తాడో గాని పవన్ సినిమా చేస్తాడా లేదా అనే క్యూరియాసిటీతో అటు పవన్ ఫ్యాన్స్ తో పాటు ఇటు జనాలు చచ్చిపోతున్నారు. అయితే పవన్ మైత్రీ వారిని పక్కన పెట్టేసి ఎ ఎం రత్నం ప్రాజెక్టుపై ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం. ఇదివరలోనే పవన్ - ఏ ఎమ్ రత్నం ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఇక మైత్రీ మూవీ మేకర్స్ కి సినిమా గనక చెయ్యాల్సి వస్తే... ఆ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు. కానీ పవన్ ఏ ఎమ్ రత్నం బ్యానర్లో సినిమా చేస్తే దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్సు. మొదట్లో ఏ ఎమ్ రత్నం - పవన్ సినిమాకి నేసన్ డైరెక్టర్ అన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా నేసన్ పేరు మాత్రం వినబడం లేదు. మరి పవన్ రెండు బ్యానర్స్ లో ఏ బ్యానర్లో మొదట నటిస్తాడో గాని... ఆ సినిమా మాత్రం మార్చి నెలాఖరున గాని ఏప్రిల్ మొదటి వారంలోగాని మొదలవ్వచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మరి ఇదే గనక నిజమైతే పవన్ కళ్యాణ్ అక్కడ రాజకీయాల్లోనూ ఇక్కడ సినిమాల్లోను దున్నేస్తాడన్నమాట.