తెలుగులో రాజేంద్రప్రసాద్ వంటి నటుడు కామెడీ చిత్రాలే కాదు.. 'ఎర్రమందారం, రాంబంటు, మేడమ్' వంటి పలు విభిన్న పాత్రలు పోషించి మెప్పించాడు. ఇక చంద్రమోహన్ కూడా కామెడీ చిత్రాలతో పాటు 'సీతామాలక్ష్మి, కలికాలం, పదహారేళ్ల వయసు' వంటి చిత్రాలు చేశాడు. వారిద్దరి నటనా ప్రతిభ అలాంటిది. కానీ తర్వాత వచ్చిన అల్లరినరేష్ మాత్రం ప్రయోగాలు చేసిన 'నేను, ప్రాణం, మేడమీద అబ్బాయి, లడ్డూబాబు' వంటి చిత్రాలతో మెప్పించలేకపోయాడు. కేవలం 'గమ్యం' మాత్రమే బాగా ఆడింది. ఇక సునీల్ పరిస్థితి కూడా అదే. ఇక గతంలో బ్రహ్మానందం, అలీ, బాబూ మోహన్ వంటి వారు హీరోలుగా చేసినా అది మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది.
ఇలా కమెడియన్లు హీరోగా మారిన తర్వాత తేడా కొడుతున్నా కూడా మన కమెడియన్లు మాత్రం హీరోల పాత్రలపై మోజు పెంచుకుంటూనే ఉన్నారు. సప్తగిరి హీరోగా మారి చేసిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రం బోల్తా కొట్టాయి. పవన్ కళ్యాణ్ ప్రమోషన్ చేసినా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు వంతు షకలక శంకర్‌ది. ఆయన హీరోగా 'శంభోశంకర'తో వస్తున్నాడు. ఈ చిత్రంలోని ఆయన ఫస్ట్‌లుక్‌ని చూస్తే సప్తగిరినే గుర్తుకొస్తున్నాడు. హీరోగా మారినా కూడా తమకు తగ్గ పాత్రలు, కామెడీ ఉండే స్టోరీలు ఎంచుకుంటే బాగానే ఆడతాయి కానీ అనవసర బిల్డప్‌లు, ఫైట్స్, యాక్షన్ సీన్స్ చేస్తేనే జనాలు తిప్పికొడుతున్నారు. అయినా సంపాదన పరంగా కమెడియన్స్ కెరీరే హాయిగా ఉంటుంది. రోజుకి లక్ష రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు. కాస్త దశ తిరిగితే మూడు నాలుగు లక్షలు అని చెప్పినా వర్కౌట్ అవుతుంది. కానీ షకలక శంకర్ వంటి వారికి ఈ మాటలు వినిపించడం లేదు.
ఇక షకలక శంకర్ అని పిలిస్తేనే అతడిని ప్రేక్షకులు గుర్తుపడతారు. కానీ ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చే చిత్రంలో షకలక పేరును కట్ చేసుకుని కేవలం శంకర్‌గా కనిపించనున్నాడు. షకలక శంకర్ అంటే కామెడీ ధ్వనిస్తుందని, అందుకే కేవలం శంకర్‌గా మాస్ అండ్ యాక్షన్ చిత్రం చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడట. మొత్తానికి ఈయన పయనం కూడా పాత వారి బాటలోనే సాగుతుందా ? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.