మొత్తానికి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా 'శ్రీమంతుడు' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య రూపొందిస్తున్న 'భరత్ అనే నేను', స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీవాసులు నిర్మిస్తున్న ' నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రాలు రెండూ ఏప్రిల్ 27న విడుదల అవుతాయని ప్రకటించారు. హీరోల సంగతేమో గానీ ఈ చిత్రాల రిలీజ్ డేట్స్ విషయంలో ఇద్దరు నిర్మాతలు ఎవరికి వారు తగ్గేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఇంతలో ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'కాలా' చిత్రం కూడా 27 వ తేదీనే రావడం ఖాయమైపోయింది.
ఇక ఏప్రిల్ 27న విడుదల అని చెప్పిన బన్నీ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'ని ఒకరోజు ముందుకు జరిపి ఏప్రిల్ 26నే విడుదల చేస్తామని చెప్పారు. అంతలోనే కొన్ని గంటల వ్యవధిలో మహేష్ 'భరత్ అనే నేను' చిత్రం కూడా ఏప్రిల్ 26నే అని ప్రకటించారు. దీనిని బట్టి ఈ పోటీ ఏదో అనివార్యంగా వచ్చింది కాదని, కావాలనే ఈ రెండు చిత్రాలు పందెం కోళ్లలా పోట్లాడుకుంటున్నాయని అర్ధమవుతోంది. ఇటీవల 'ఇంటిలిజెంట్, తొలిప్రేమ' విషయాలలో 'తొలిప్రేమ' క్యాష్ చేసుకుంది. మరి మహేష్, బన్నీ విషయంలో ఏ చిత్రం కలెక్షన్లను క్యాష్ చేసుకుంటుందోనని అందరు వెయిట్ చేస్తున్నారు.
ఏది హిట్టయినా ఫ్లాపయినా రెండు చిత్రాలలో భారీ స్టార్స్ ఉండటంతో కలెక్షన్ల విషయంలో రెండు చిత్రాలు ఎంతో కొంత నష్టపోవడం ఖాయమనే చెప్పాలి, ఇక రజనీ 'కాలా'ని కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. అయితే '2.0' అంత పోటీ ఉండకపోచ్చు గానీ 'కాలా' చిత్రం మరో 'భాషా' కానుందని కోలీవుడ్ మీడియా అంటుంది. అయినా పోటీ పడితే నష్టపోయేది నిర్మాతలు, బయ్యర్లే గానీ ప్రేక్షకులుకాదు. వారు ఏ చిత్రం బాగుంటే అదే చూస్తారు. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది కూడా నిర్మాతలు, బయ్యర్లేనని చెప్పాలి.