ఈ డిజిటల్ యుగంలో నాడు వెంకటేష్, సిమ్రాన్ నటించిన ఓ చిత్రంలో మరణించిన స్వర్గీయ ఎన్టీఆర్‌పై ఓ పాటను చిత్రీకరించారు. ఇక రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్‌ల 'యమదొంగ' చిత్రంలో కూడా నాటి ఎన్టీఆర్ తెరపై కనిపించి నటించాడు. నాడున్న సాంకేతిక విలువల కంటే 'బాహుబలి, 2.0' ల ద్వారా డిజిటల్ విప్లవం ఇప్పుడు పూర్తి స్వింగ్‌లో వుంది. ఎలాంటి సృష్టికైనా ప్రతిసృష్టి చేయగల స్థితికి చేరింది. మరో వైపు 'బాహుబలి, భాగమతి' చిత్రాలతో లావుగా ఉండే అనుష్కని కూడా నాజూకుగా చూపించడం సాధ్యమైంది.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మహానటి సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మార్చి 29న విడుదలవుతుంది అనుకుంటున్న ఈ చిత్రంలో మహానటిగా టైటిల్‌రోల్‌ని కీర్తిసురేష్ పోషిస్తోంది. ఇక దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్‌గా, ఎస్వీరంగరావుగా మోహన్‌బాబు, జమునగా సమంత, ఇలా పలువురు ఇందులో నటిస్తున్నాడు. అశ్వనీదత్ స్వీయ నిర్మాణ సంస్థ వైజయంతీ బేనర్‌లో అశ్వనీదత్ కుమార్తెలు, స్వప్నాదత్, ప్రియాంకా దత్‌లు నిర్మిస్తున్నారు. అశ్వనీదత్ అల్లుడు 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక సావిత్రి బయోపిక్ అంటే అందులో ఎన్టీఆర్, ఏయన్నార్‌ల పాత్రలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దాంతో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు సావిత్రితో కలిసి నటించే సీన్స్‌ని డిజిటల్ రూపంలో రూపొందిస్తున్నారని సమాచారం. ముందుగా ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్‌ని, ఏయన్నార్ పాత్రకి నాగచైతన్యని అనుకున్నా కూడా వీలుకాలేదు. ఆ తర్వాత వీరి పాత్రలో నటిస్తున్నారంటూ పలువురి పేర్లు బయటికి వచ్చాయి. మరి ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు డిజిటల్ రూపంలోనే సినిమా మొత్తం కనిపిస్తారా? వారి పాత్రలకంటూ ఎవ్వరూ ఉండరా? అనే ఆసక్తికర చర్చలుసాగుతున్నాయి.