'పిల్లజమీందార్' చిత్రంతో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు జి.అశోక్. ఈ చిత్రం తప్ప ఆయన దర్శకత్వం వహించిన 'సుకుమారుడు' నుంచి ఏ చిత్రం కూడా ఆడలేదు. ఇక ఈయన చాలా కాలం కిందట విక్టరీ వెంకటేష్ నటించే ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని, ఇది కూడా మూకీ చిత్రమనే ప్రచారం జరిగింది. కథను పూర్తిగా తయారు చేసి, స్క్రిప్ట్‌తో సురేష్ ప్రోడక్షన్స్ వెంట ఎంత తిరిగినా ఈ చిత్రం పట్టాలెక్కలేదు. దాంతో అశోక్ యువి క్రియేషన్స్ పుణ్యామా అని 'భాగమతి' చిత్రం తీసి తన సత్తా చాటాడు. కథ, కథనాలు గొప్పగా లేకపోయినా ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. దాంతో ఆయనకు తాజాగా సురేష్ ప్రోడక్షన్స్ సంస్థ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం.
ప్రస్తుతం వెంకటేష్ సురేష్ ప్రోడక్షన్స్-ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో తేజ దర్శకత్వంలో 'ఆటా నాదే వేటా నాదే' అనే చిత్రం చేయనున్నాడు దీని తర్వాత వరుణ్‌తేజ్‌తో కలిసి మల్టీస్టారర్‌గా దిల్‌రాజు నిర్మాతగా, హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' ( ఫన్ అండ్ ఫ్రస్టేషన్) చేయనున్నాడు. మరి అశోక్ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కనుందో తెలియరావడం లేదు. మరి అశోక్ ఇంతకు ముందు చెప్పిన మూకీ చిత్రం కథతోనే ఈ చిత్రం ఉంటుందా? లేక కొత్త సబ్జెక్ట్‌తో ఉంటుందా అనేది తెలియాల్సివుంది...! మొత్తానికి 'గురు' తర్వాత ఎంతో గ్యాప్ తీసుకున్న వెంకటేష్ వరుస చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడనే చెప్పాలి.