మెగాహీరో వరుణ్‌తేజ్, రాశిఖన్నా జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'తొలిప్రేమ' చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన దిల్‌రాజుకి 'తొలిప్రేమ' ఆ నష్టాలను తీర్చడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి తన తొలి చిత్రంతోనే తన సత్తా చాటాడని పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెంకీని అభినందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శిష్యుడి వంతు వచ్చింది. తనకు నచ్చిన చిత్రాలను పొగడటంలో రాజమౌళి ఏమాత్రం వెనకడుగు వేయడు. కానీ సింపుల్‌గా భలే ఉంది. అని మాత్రమే కామెంట్ చేస్తాడు. కానీ 'తొలిప్రేమ' చిత్రం కోసం మాత్రం రాజమౌళి చిన్నపాటి రివ్యూనే అందించాడు.
తనకు సాధారణంగా లవ్ జోనర్ చిత్రాలు నచ్చవని, కానీ 'తొలిప్రేమ' చూసి ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపాడు. దర్శకుడు వెంకీ తన తొలి చిత్రాన్ని బాగా హ్యాండిల్ చేశాడని ప్రశంసించాడు. వరుణ్‌తేజ్ తన సినిమా సినిమాకి నటనా సామర్ధ్యం పెంచుకుంటూ పోతున్నాడని, రాశిఖన్నా ఎంతో అందంగా ఉండటమే కాదు... నటన పరంగా కూడా మెప్పించిందని అన్నాడు. ఇక బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడులకు శుభాకాంక్షలు. ఈ చిత్రం నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. వారికి అభినందనలు అంటూ తన ఫేస్‌బుక్‌లో కామెంట్స్ పెట్టాడు. దీని వల్ల ఈ చిత్రం ఇక రాబోయే రోజుల్లో కూడా మంచి కలెక్షన్లు సాధించి, స్టడీగా సాగటం ఖాయమని, రాజమౌళి రివ్యూ కూడా తమ చిత్రానికి బాగా ఉపయోగపడుతుందని యూనిట్ నమ్మకంగా ఉంది.