లోఫర్, మిష్టర్ చిత్రాలతో వరుణ్ తేజ్ ఇండస్ట్రీ నుండి సర్దుకోవాలేమో అనుకున్నారు అంతా. కేవలం మెగా బ్రాండ్ మీద ఈ కుర్రోడు ఎన్ని రోజులు ఇండస్ట్రీలో చలామణి అవుతాడని అనుకున్నారు. కానీ వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో హీరో హీరోయిన్స్ కి సమాంతర రోల్ ఇచ్చినా మారు మాట్లాడకుండా ఫిదా సినిమాలో సాయి పల్లవితో కలిసి నటించాడు. ఆ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం సోలోగా సాయి పల్లవి పట్టుకుపోయింది. అందులో హీరోగా నటించిన వరుణ్ తేజ్ కి గాని డైరెక్టర్ శేఖర్ కమ్ములకి గాని పెద్దగా పేరు రాలేదు. అసలు ఆ సినిమాతోనే వరుణ్ తేజ్ దశ తిరిగింది. మంచి కలెక్షన్స్ తో ఫిదా సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో మంచి సినిమా అయ్యింది.
అదే సమయంలో ఒక కొత్త దర్శకుడితో ఒక ప్యూర్ లవ్ స్టోరీ ని రాశిఖన్నాతో కలిసి చెయ్యడానికి రెడీ అవడమూ... సినిమా టైటిల్ పెట్టినప్పటి నుండి.. ఆ సినిమాపై క్రేజ్ పెరగడం.. పవన్ కళ్యాణ్ టైటిల్ తో వస్తున్న ఈ తొలిప్రేమ సినిమాతో వరుణ్ తేజ్ కి గట్టిగా హిట్ పడాలని మెగా ఫ్యాన్స్ చేసిన పూజలు ఫలించి తొలిప్రేమ వరుణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఫిదాతో క్రెడిట్ తన అకౌంట్ లో వేసుకోలేని వరుణ్ తేజ్ తొలిప్రేమ విజయంతో ఫుల్ క్రెడిట్ కొట్టేశాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటన అద్భుతం అన్నట్టుగా వుంది. సినిమా విజయంలో వరుణ్ తేజ్ తనవంతుగా కీలక పాత్ర పోషించాడు. అలాగే తొలిప్రేమలో ఆది పాత్రని వెంకీ అట్లూరి అద్భుతంగా మలిచాడు.
విలక్షణ వ్యక్తిత్వం ఉన్న కుర్రాడిగా, రొమాంటిక్ సీన్లలో.. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో వరుణ్ తేజ్ పెరఫార్మెన్సు కి నూటికి నూరు మార్కులు వేసేశారు సినిమా విమర్శకులు కూడా. అలాగే వరుణ్ కొత్త లుక్స్ తో మెప్పించడమే కాదు... మొదటిసారి డ్యాన్సులతోనూ సత్తా చాటుకునే వరుణ్ ప్రయత్నం మాత్రం సూపర్. మరి ఫిదా హిట్ తో వరుణ్ తేజ్ ఎంతగా సంతోష పడ్డాడో తెలియదు గాని.. తొలిప్రేమ హిట్ తో మాత్రం గాల్లో తేలిపోతున్నాడట.