ఈ ఏడాది ప్రథమార్ధం 'అజ్ఞాతవాసి, జై సింహా, రంగులరాట్నం' వంటి సినిమాలు తుస్ మనిపించాయి. కానీ ఆ తర్వాత వచ్చిన అనుష్క 'భాగమతి' కాస్త ఊరటనిచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఛలో సినిమా కాస్త బెటర్మెంట్ గా ఉంది. ఇక ఫిబ్రవరి రెండో వారంలో వచ్చిన ఇంటిలిజెంట్, గాయత్రీ సినిమాలు తుస్ మనిపించగా.. ఆ తర్వాత వచ్చిన వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమా హిట్ అయ్యింది. అయితే ఇక్కడ చిన్న సినిమాలుగా వచ్చి చితక్కొట్టేసిన ఛలో, తొలిప్రేమ సినిమాలకు ఒక కోఇన్సిడెన్స్ వుంది. అదేమిటంటే ఈ రెండు సినిమాల దర్శకులు కొత్తవారు కావడమే.
అంతేకాదు రెండు సినిమాల దర్శకుల పేర్లు కూడా కోఇన్సిడెన్స్ అన్నట్టుగా వెంకీ కావడమే ఇక్కడ విశేషం. ఛలో దర్శకుడి పేరు వెంకీ కుడుముల అయితే... తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి. ఛలో సినిమాని మీడియం హీరో తో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి హిట్ కొట్టిన వెంకీ కుడుముల పేరు సినిమాకి వచ్చిన టాక్ తో తెగ మార్మోగిపోయింది. అలాగే వరుణ్ తేజ్ వంటి మీడియం బడ్జెట్ హీరోతో వెంకీ అట్లూరి అనే డెబ్యూ డైరెక్టర్ తొలిప్రేమని మీడియం బడ్జెట్ తో తెరకెక్కించి అదిరిపోయే టాక్ తో విజయం సాధించాడు. చాలా లిమిటెడ్ బడ్జెట్ తో హీరోల మార్కెట్ కున్న పరిమితులను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమాలు యూత్ ని టార్గెట్ చేసుకున్నవే కావడం విశేషం.
మరి ఇలా వెంకీ కుడుములకు ఛలో సినిమా హిట్ తో మంచి ఆఫర్స్ వస్తున్నాయనే ప్రచారం బాగానే ఉంది. అలాగే ఇప్పుడు తాజాగా తొలిప్రేమతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరికి కూడా అప్పుడే ఆఫర్స్ వస్తున్నట్టుగా టాక్. మరి ఛలో, తొలిప్రేమ కథలు కొత్తగా లేకపోయినా... ఈ సినిమాలను దర్శకులు మలిచిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవ్వడమే ఈ దర్శకులకు మంచి పేరు రావడానికి ప్రధాన కారణం. అలాగే ఈ రెండు సినిమాల హిట్స్ లో హీరోల కన్నా ఎక్కువ పేరు దర్శకులకే రావడం కూడా గమనించదగ్గ విషయం.