కోలీవుడ్‌లో ధనుష్, శింబుల తరాహాలో తెలుగులో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకోవాలని ప్రతి క్షణం పరితపించే వ్యక్తి మంచు మనోజ్. జుట్టున్నమ్మ ఏ కోప్పైనా పెడుతుందని అన్నట్లుగా, చేతిలో తండ్రి సంపాదించిన నాలుగురాళ్లు ఉండటంతో ముందుగా నటునిగా కూడా రాణించలేకపోయినా తన ప్రతి చిత్రంతో మంచు మనోజ్ ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ముందుగా ఒక రంగంలో పేరు తెచ్చుకోవడం వదిలేసి అన్ని రంగాలలో వేలు పెడుతుంటాడు. అందుకేనేమో ఆ మధ్య ఇక తాను నటునిగా నటించనని చెప్పి బాంబ్ పేల్చి తర్వాత సర్దుకున్నాడు.
ఇక ఈయన తన చిత్రాలలోని ఫైట్స్‌ని తానే కంపోజ్ చేసుకుంటాడు. పాటలకు డ్యాన్స్‌లని తానే కొరియోగ్రఫీ చేసుకుంటాడు. గాయకుడిగా, పాటల రచయితగా కూడా మారాడు. 'నేను మీకు తెలుసా' అంటూ ఫైట్స్ కంపోజ్ చేసుకుని, 'కన్ను తెరిస్తే జననమేలే' పాటను కూడా రాశాడు. 'బిందాస్, మిస్టర్ నూకయ్య, కరెంట్ తీగ, వేదం' వంటి చిత్రాలలో తన ఫైట్స్‌ని తానే కంపోజ్ చేసుకున్నాడు. 'పోటుగాడు' చిత్రంలో ప్యార్‌మే పడిపోయానే అనే పాటను సరదాగా పాడి వినిపించాడు. ఇక ఈయనకు సంగీత దర్శకుడు అచ్చుతో మంచి అనుబంధం ఉంది. తాను నటించే చిత్రాలకు అచ్చు చేత సంగీతం అందించడమే కాదు.. ఆయనతో సంగీత ప్రయాణం కూడా చేస్తుంటాడు.
తాజాగా మంచు మనోజ్ అచ్చుతో కలిసి సంగీత దర్శకునిగా దర్శనం ఇవ్వనున్నాడు. అది కూడా తెలుగు చిత్రానికి కాదు. ఏకంగా హాలీవుడ్ చిత్రానికే ఎసరు పెట్టాడు. ఆస్కార్ విన్నింగ్ యాక్టర్స్ బ్రీలార్సన్ లీడ్ యాక్టర్‌గా నటిస్తున్న 'బాస్మతి బ్లూస్' అనే చిత్రానికి అచ్చుతో కలిసి సంగీతం అందించాడు. ఇందులో మంచు లక్ష్మి కూడా ఓ కీలక పాత్రను పోషించనుంది. మరి ఈ చిత్రం మనోజ్‌కి సంగీత దర్శకునిగా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాల్సి ఉంది.