ఏ మాటకామాటే చెప్పుకోవాలి గానీ నిజమైన పౌరుషం ఉన్న తెలుగు వారంటే తెలంగాణ వారే అని నిజాయితీగా అంగీకరించాలి. వారు తమ తెలంగాణ కోసం పార్టీలు, స్పర్దలు అన్ని పక్కనపెట్టి ఒకటై తామనుకున్నది సాధించారు. తెలంగాణ ఎంపీలకు, ఏపీ ఎంపీలకు ఉన్న మరో తేడా ఏమిటంటే.. తెలంగాణ ఎంపీలలో దాదాపు అందరూ పూర్తి స్థాయి రాజకీయనాయకులు. కానీ ఏపీలో ఎంపీలు బడా పారిశ్రామికవేత్తలు. వారికి రాజకీయాలనేవి పార్ట్ టైమ్ వంటివి. కేవలం తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు, కాపాడుకునేందుకు మాత్రమే సుజనాచౌదరి, సీఎం రమేష్, గల్లా జయదేవ్ వంటి వారు పరిమితమవుతుంటారు. వీరి కంటే కిందటి పార్లమెంట్‌లో సమైక్యాంద్రకోసం పోరాడిన లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి, సబ్బంహరి, హర్షకుమార్, శివప్రసాద్‌లే మేలు.
కేంద్రం మోసం చేసిందని ఇప్పుడు ఎన్నికలు వచ్చే వేళ వీరు నిజం చెబుతున్నారు గానీ ఇప్పటికీ ఇది చివరి బడ్జెట్ కాకుండా ఉంటే ఇప్పటికీ టిడిపి ఎంపీలు ప్రజలను ఇంకా మభ్యపెడుతూనే ఉండి ఉండేవారు. నేడు కేంద్రం ఏమీ ఇవ్వలేదని చెబుతున్న వీరి గొంతులు ఇంతకాలం ఏమయ్యాయి. నిజంగానే ఏపీ ఎంపీలను జోకర్లుగానే భావించాలి. అదే అభిప్రాయాన్ని రాంగోపాల్ వర్మ కూడా వ్యక్తం చేశాడు. పార్లమెంట్‌లో ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న టిడిపి ఎంపీలను ఉద్దేశించి వర్మ టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించాడు. ఎంపీలు ఆందోళన చేస్తోన్న ఓ ఫోటోని పోస్ట్ చేసిన ఆయన రెండు పోస్ట్‌లు చేశాడు. తొలి పోస్ట్‌లో 'ఇలాంటి జోకర్లు ఏపీకి ప్రజా ప్రతి నిధులుగా ఎంపిక కావడం చూస్తున్న ప్రధాని నరేంద్రమోదీ బహుశా ఏపీని కూడా ఓ జోక్‌గా భావిస్తున్నాడేమో..? వీరు జోకర్లకు తక్కువ అంటూ ఎద్దేవా చేశాడు.
మరొక పోస్ట్‌లో 'టీడీపీకి చెందిన వీళ్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగుదేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారు' అంటూ మండిపడ్డాడు. ఈ విషయంలో మాత్రం అందరు వర్మ వ్యాఖ్యలకు పూర్తి మద్దతును తెలుపుతున్నారు. ఇంతకాలం ప్రత్యేకహోదా బదులు ప్రత్యేకప్యాకేజీ అద్భుతం అని వాదించిన చంద్రబాబు, సుజనాచౌదరి వంటి వారు రాష్ట్ర ప్రజలను ఎంతలా మోసం చేశారో ఈ పరిణామాలను బట్టి అర్ధమవుతోంది.