ఏదైనా సినిమా హిట్ అవడం పాపం.. ఆ సినిమా దర్శకుడి కోసం హీరోతోపాటు.. బడా నిర్మాతలు కూడా ఒక కన్నేసి ఉంచడమే కాదు... అతనిని ఎప్పుడెప్పుడు వలలో వేసుకుందామా అని కాచుకుని కూర్చుంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఒక డెబ్యూ డైరెక్టర్ ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకులు తరుణ్ భాస్కర్, సందీప్ వంగా వంటి దర్శకులు ఎదుర్కున్న పరిస్థితే... ఈ దర్శకుడిది కూడా. అతనెవరో ఈపాటికే గెస్ చేసి ఉండాలి. అతనేనండీ తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి.
వరుణ్ తేజ్ - రాశి ఖన్నా లు జంటగా నటించిన తొలిప్రేమ సినిమా గత శనివారం విడుదలై హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాని తెరకెక్కించిన వెంకీ అట్లూరికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలపడమే కాదు... కొంతమంది నిర్మాతలు అప్పుడే వెంకీ అట్లూరి వెనక పడినట్లుగా రకరకాల వార్తలు సోషల్ మీడియాని చుట్టిముట్టేశాయి. అందులోను వెంకీ అందుకున్న ఆఫర్స్ అలాంటి ఇలాంటి ఆఫర్స్ కాదండోయ్. రెండు బడా నిర్మాణ సంస్థలు వెంకీకి అడ్వాన్స్ లు ఇచ్చేసి లాక్ చేసేసాయంటున్నారు. అందులో ఒక నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.
ఇక రెండోది దిల్ రాజు బ్యానర్ అట. తొలిప్రేమ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. వెంకీ అట్లూరి మేకింగ్ స్టయిల్ కి ఫిదా అయ్యి అతని రెండో సినిమాని కూడా తన బ్యానర్ లోనే చెయ్యాలని... అగ్రిమెంట్ చేసుకోవడమే కాదు.. అతనికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడనే టాక్ నడుస్తుంది. అలాగే వెంకీ అట్లూరి తన మూడో సినిమాని మాత్రం దిల్ రాజుగారి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో చేయబోతున్నాడట. మామూలుగా దిల్ రాజు కి వెంకీ అట్లూరి కి మధ్య ముందు నుండే మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఆ సాన్నిహిత్యంతోనే.. దిల్ రాజు బ్యానర్ లో వెంకీ చెయ్యడానికి ఒప్పుకున్నాడట. మరి నిర్మాతలైతే వెంకీని లాక్ చేసి పడేసారు గాని.. అందుకు తగ్గ హీరోలు మాత్రం ఇంకా సెట్ కాలేదు. మరి వెంకీ అట్లూరి డైరెక్షన్ లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈసారి నటించబోయే ఆ హీరో ఎవరో?