దర్శకుడు త్రివిక్రమ్ ఎప్పుడు తన సినిమాలను ఏదో ఒక నవల నుండి అయినా లేదంటే.. ఏదైనా హాలీవుడ్, ఫ్రెంచ్ ఇతర భాషల సినిమాల నుండి అయినా స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తాడనే విషయం గత రెండు సినిమాల నుండి ఓపెన్ గానే బహిర్గతమవుతుంది. 'అఆ' సినిమాని యద్దనపూడి సులోచనా రాణి నవల 'మీనా' నుండి కాపీ కొట్టి దొరికిపోయిన త్రివిక్రమ్, నిన్నటికి నిన్న 'అజ్ఞాతవాసి' సినిమాని ఒక ఫ్రెంచ్ మూవీ నుండి కాపీ కొట్టి దొరకడమే కాదు... లార్గోవిచ్ దర్శకనిర్మాతలు ఇంకా అజ్ఞాతవాసి నిర్మాతలైన హారిక అండ్ హాసిని వారిని వదలడం లేదు. నిన్ను వదలా అంటూ వెంటపడుతూనే ఉన్నారు.
అయితే ఇప్పుడు త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే సినిమా కోసం మధు బాబు నుండి షాడో నవల హక్కులు తీసుకున్నాడని.... ఎన్టీఆర్ సినిమా కి కాపీ రైట్స్ బాధ ఉండదనే ప్రచారం గట్టిగా జరిగింది. అలాగే ఎన్టీఆర్ - త్రివిక్రం సినిమాకి నవల రచయితా మధు బాబే రచనా సహకారం కూడా అందిస్తున్నారని.. ఈసారి రచయితకు త్రివిక్రమ్ క్రెడిట్ కూడా ఇవ్వబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే మధు బాబు దగ్గర త్రివిక్రమ్ నవల హక్కులు కొనడం అనేది ఒట్టి రూమరని తేలిపోయింది. ఆ విధంగా మధు బాబే ఒక క్లారిటీ ఇచ్చేసాడు.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి తాను కథ అందిస్తున్నానన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని... ఒకఛానెల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు నవల రచయిత మధు బాబు. అసలు త్రివిక్రమ్ సినిమా విషయమై తనను ఎవరు సంప్రదించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి నవల రచయిత మధు బాబు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈసారి త్రివిక్రమ్ తన సొంత కథతో సినిమా చేస్తాడా? లేదంటే ఏదైనా పర భాషా చిత్రానికి స్ఫూర్తిగా పొంది తీస్తాడా? అనేది మాత్రం అప్పుడే చెప్పలేం.