ఫిదా సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ ఇప్పుడు తొలిప్రేమతో కూడా అదిరిపోయే హిట్ అందుకున్నాడు. నిన్న శనివారం విడుదలైన తొలిప్రేమ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా అదిరిపోయే టాక్ తెచ్చుకుని వరుణ్ తేజ్ కి మరో హిట్ అందించేసింది. ఫిదా సినిమాలో పరిణితి గల అమెరికా అబ్బాయిలా ఒక తెలంగాణ అమ్మాయిని ప్రేమించి... మధ్యలో కొన్ని సమస్యలు ఎదుర్కొని నిలబడి ఆ అమ్మాయి ప్రేమను దక్కించుకునే యువకుడిగా అదిరిపోయే పెరఫార్మెన్స్ చేసిన వరుణ్ మరోమారు అలాంటి ప్రేమ కథతోనే హిట్ కొట్టాడు. వరుణ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా వచ్చిన 'తొలిప్రేమ'కి ఫస్ట్ డే అదిరి పోయే టాక్ వచ్చింది.
సినిమాకి టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుండే.. మంచి అంచనాలతో మార్మోగిన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి హిట్ టాక్ వచ్చేసింది. ఈ సినిమాలో ఆదిత్యగా వరుణ్ తేజ్ చాలా సహజ సిద్ధంగా నటించి శెభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాలో వర్ష (రాశి ఖన్నా)తో ప్రేమలో పడటం .. మనస్పర్థలతో ఇరువురు విడిపోవడం .. విడిపోయాక మానసిక వేదనను అనుభవించడం .. తిరిగి మళ్ళీ వర్షాని కలిసినప్పుడు కలిగే ఎమోషన్స్ అన్నిటిని క్యారీ చేస్తూ వరుణ్ తేజ్ నటనలో మంచి పరిణతిని కనబర్చాడు. కొన్నిసార్లు ఇగోకి, ప్రేమకి మధ్య నలిగిపోయే సీన్స్ లో వరుణ్ తేజ్ నటనకు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు మాములు ప్రేక్షకుడు కూడా ఫిదా అయ్యామని చెబుతున్నారు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ - రాశి ఖన్నాల రొమాంటిక్ సీన్స్ అలాగే వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అదుర్స్ అంటూ ప్రేక్షకులు కితాబినిచ్చేస్తున్నారు. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో వరుణ్ తేజ్ కి మరో హిట్ పడినట్టేననే అభిప్రాయాలను ముక్త ఖంఠంతో అందరూ వ్యక్తం చేస్తున్నారు. మరి ఫిదా హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు తొలిప్రేమతో మరో హిట్ కొట్టాడుగా అంటున్నారు.